kohli half centuryఇండియన్ క్రికెట్ ప్రేమికులకు మరోసారి తన బ్యాట్ పవర్ ఏమిటో రుచి చూపించాడు యువరాజ్ సింగ్. ఆసియా కప్ లో భాగంగా శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్ లో భారత్ సునాయాస విజయానికి కారణమయ్యాడు యువరాజ్. ఎప్పటినుండో యువీ సంధించే అద్భుతమైన షాట్లను వీక్షించాలన్న కోరికను కొంతవరకు తీర్చడంలో సక్సెస్ అయ్యాడు యువీ.

139 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత జట్టు 16 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి, పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో టీమిండియా బ్యాటింగ్ ‘వెన్నుముక’ విరాట్ కోహ్లి క్రీజులో నిలదొక్కుకోగా, కోహ్లికి అండగా రైనా (25) పరుగులతో సహకారం అందించాడు. అయితే మ్యాచ్ భారత్ వైపుకు తిరుగుతున్న దశలో రైనా అవుట్ కావడంతో రంగంలోకి దిగిన యువరాజ్, వచ్చి రావడంతోనే తన ఉద్దేశాన్ని శ్రీలంకకు చెప్పాడు.

ఎదుర్కొన్న 18 బంతులలో 3 సిక్సర్లను, 3 ఫోర్లను బాదిన యువరాజ్ 35 పరుగులు చేసి మ్యాచ్ ను భారత్ వశం చేసాడు. మరో ఎండ్ లో కోహ్లి నింపాదిగా ఆడుతూ తన 13వ టీ20 హాఫ్ సెంచరీ (56 నాటౌట్) పూర్తి చేసి, టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలను నమోదు చేసిన మెక్కల్లం, గేల్ రికార్డును సమం చేసాడు. 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్య చేధన చేసిన టీమిండియా ఆసియా కప్ ఫైనల్లో ప్రవేశించింది.

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టును కేవలం 138 పరుగులకు నియత్రించడంలో బౌలర్లు వారి పాత్రను సమర్ధవంతంగా నిర్వర్తించారు. బూమ్రా, పాండ్య, అశ్విన్ చెరో రెండు వికెట్లతో సత్తా చాటగా, నెహ్రా ఒక వికెట్ ను సొంతం చేసుకున్నారు. శ్రీలంక బ్యాట్స్ మెన్లలో కపుగేదర ఒక్కడే 30 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ ను నమోదు చేయగలిగాడు.