Kodumur-YSRCP-MLA-Sudhakarజగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అన్నివిదాలా అభివృద్ధి చేసి చూపించి 175 సీట్లు మాకేనని చెప్పుకొన్నా, మాకే ఇవ్వాలని ప్రజలను అడిగినా అందరూ తప్పక హర్షించేవారు… గడప గడపకి నీరాజనాలు పట్టేవారు. కానీ సంక్షేమ పధకాలతో ప్రజలను ప్రలోభపెట్టి 175 సీట్లు గెలుచుకొందామని దురాశకు పోవడం, మళ్ళీ వాటి భారం తగ్గించుకొనేందుకు ఆంక్షలు విధించడంతో గడప గడపకి మంత్రులు, ఎమ్మెల్యేలకి చీత్కారాలు ఎదురవుతున్నాయని చెప్పక తప్పదు.

కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ గడప గడపకి కార్యక్రమంలో ప్రజలను కలిసినప్పుడు ఆయనను వైసీపీకి చెందిన ఓ కుటుంబమే గట్టిగా నిలదీసింది. “మేమిద్దరం వైసీపీ కార్యకర్తలం. గత ఎన్నికలలో మా వార్డులో ఇంటింటికీ తిరిగి ప్రజలను ఒప్పించి వైసీపీకి ఓట్లు వేయించాము. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక మాకే సున్నం పెట్టింది. మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిని అతికష్టం మీద చదివించుకొంటున్నాము. మేము అమ్మఒడి పధకానికి దరఖాస్తు చేసుకొంటే మాకు కారు ఉందనే వంకతో తిరస్కరించారు. ఆ కారే మా జీవనాధారం. కానీ కారు ఉంటే సంక్షేమ పధకాలు ఇవ్వమని ముందే చెప్పి ఉండవచ్చు కదా? కానీ అప్పుడు ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పధకాలు అందజేస్తామని చెప్పి ఇప్పుడు ఇలాంటి వంకలు పెట్టి ఇవ్వకుండా ఎగవేస్తున్నారు. ఇందుకోసమేనా మేము వైసీపీకి ఓట్లు వేయించి జగనన్నను ముఖ్యమంత్రిని చేసింది?గతంలో చంద్రబాబు పరిపాలించినప్పుడు ఎలాంటి షరతులు లేకుండా మాకు పధకాలు అందేవి. కానీ ఇప్పుడు మన ప్రభుత్వమే అధికారంలో ఉన్నా మాకు సంక్షేమ పధకాలు ఇవ్వకపోవడం చాలా దారుణం,” అంటూ భార్యాభర్తలు ఇద్దరూ ఎమ్మెల్యే సుధాకర్‌ని కడిగేశారు. వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ‘నేను అధికారులతో మాట్లాడుతాను,” అని చెప్పి ముందుకు సాగిపోయారు.

గుంటూరు జిల్లా చినపాకలూరులో వైసీపీ ఎమ్మెల్యే సుచరిత గడప గడపకి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆమెను ఓ వ్యక్తి గట్టిగా నిలదీయడంతో ఆమె షాక్ అయ్యారు. అప్పుడు ఆమె పక్కనే ఉన్న వైసీపీ నాయకుడు అతనితో వాగ్వాదానికి దిగి కొట్టినంత పని చేశాడు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారితే తమకే ప్రమాదమని భావించిన పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని బలవంతంగా పక్కకు ఈడ్చుకుపోయారు.

అతని అరుపులు పట్టించుకోకూడా ఎమ్మెల్యే సుచరిత ముందుకు సాగిపోయారు. సంక్షేమ పధకాలు ఇస్తున్నా ప్రజలు తమను ఎందుకు చీదరించుకొంటున్నారు? ఈ లెక్కన వైసీపీకి 175 సీట్లు కాదు కదా 17 సీట్లు అయినా వస్తాయా? అని ఆలోచించుకొంటే మంచిది.