Kodi-Kathi-Srinuరాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోడికత్తి కేసుని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తున్నా… ఆ దాడి జరిగి నాలుగేళ్ళవుతున్నా ఇంకా విచారణ పూర్తికాలేదు!

ముఖ్యమంత్రి బాబాయ్ వివేకానందరెడ్డి హత్యతో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు బయటే ఉన్నారు. కాకినాడలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యంని అతికిరాతకంగా చంపిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతాబాబుకి కూడా ఎప్పుడో బెయిల్‌పై విడుదలయ్యారు. కానీ కోడికత్తి కేసులో అరెస్ట్ అయిన నేటికీ నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌ ఖైదీగానే ఉండిపోయాడు.

బెయిల్‌ కోసం అతను పెట్టుకొన్న పిటిషన్లని ఎన్ఐఏ కోర్టు తిరస్కరిస్తోంది. కనుక అతని తల్లితండ్రులు ముఖ్యమంత్రి, మంత్రులు, డీజీపీ కార్యాలయాల చుట్టూ కాళ్ళరిపోయేలా ప్రదక్షిణాలు చేస్తూనే ఉన్నారు. కానీ శ్రీనివాస్‌కి మాత్రం ఈ కేసు నుంచి, జైలు నుంచి విముక్తి లభించడమే లేదు. కనుక నాలుగేళ్ళుగా రిమాండ్‌ ఖైదీగా మిగిలిపోయాడు.

ఈ కేసులో బాధితుడు అంటే సిఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా కోర్టుకు హాజరై తన అభిప్రాయం తెలియజేస్తే తప్ప అతనికి విముక్తి లభించకపోవచ్చని న్యాయనిపుణులు చెపుతున్నారు. కానీ సిఎం జగన్మోహన్ రెడ్డికి క్షణం తీరికలేకుండా ఉంటారు కనుక ఎన్నిసార్లు నోటీసులు పంపినా హాజరుకాలేకపోతున్నారు.

కనుక ఈ కేసు తదుపరి విచారణ మార్చి 14కి వాయిదా వేసి ఆరోజు తప్పక విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ ఎన్‌ఐఎ కోర్టు సిఎం జగన్మోహన్ రెడ్డికి మరోసారి నోటీస్ పంపించింది. ఒకవేళ ఆ రోజు రాకపోతే శ్రీనివాస్ రిమాండ్‌ కాలాన్ని పరిగణనలోకి తీసుకొని బెయిల్‌ మంజూరు చేస్తుందేమో చూడాలి!