Kodela Sivaram kesineni Naniగుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జ్‌గా కన్నా లక్ష్మినారాయణ పేరును చంద్రబాబు నాయుడు ఖరారు చేయడంతో, కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు సత్తెనపల్లి అరాచక రాజకీయ పరిస్థితులున్నప్పుడు తన తండ్రి కోడెల శివప్రసాద్ వాటినన్నటినీ చక్కదిద్ది సత్తెనపల్లిని టిడిపికి కంచుకోటగా మార్చారని, కానీ ఇప్పుడు టిడిపి తనను కాదని చంద్రబాబు నాయుడుని ఒకప్పుడు దూషించి, టిడిపిపై కేసులు కూడా వేసిన కన్నా లక్ష్మినారాయణకు టికెట్‌ ఇవ్వడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

తన తండ్రి చనిపోయిన తర్వాత సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు, ఆయన అనుచరుల దాడులు, వేధింపులు భరిస్తూ టిడిపిని కాపాడుకొంటూ వస్తున్నామని, కానీ తమను కాదని పార్టీలు మారివచ్చిన కన్నా లక్ష్మినారాయణకు టికెట్‌ ఖరారు చేయడాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని కోడెల శివరాం బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.

చంద్రబాబు నాయుడు కన్నాకు టికెట్‌ ఖరారు చేసేముందే కోడెల శివరాంతో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ, ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన్నట్లు సమాచారం. కనుక కోడెల శివరాం ఈరోజు తన అంచరులతో కలిసి సత్తెనపల్లిలో తండ్రి ఫోటోతో ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ చేశారు. తప్పనిసరిగా సత్తెనపల్లి టికెట్‌ తనకే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

సత్తెనపల్లి టిడిపిలో రాజుకొన్న ఈ నిప్పును వెంటనే చల్లార్చకపోతే మంత్రి అంబటి రాంబాబు దానిని రాజేసి పార్టీలో చిచ్చుపెట్టడం ఖాయం. విజయవాడలో కూడా కేశినాని సోదరుల పంచాయితీలో చంద్రబాబు నాయుడు నలిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు పంచాయతీలు చంద్రబాబు నాయుడు కోర్టులోనే ఉన్నాయి కనుక ఆయన వారిరువురినీ ఏవిదంగా బుజ్జగిస్తారో… దానికి వారు చల్లబడతారో లేదో?