M kodandaramM kodandaramమహా కూటమిలో అన్ని అంశాలను త్వరగా తేల్చాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం కాంగ్రెస్‌కు స్పష్టంచేశారు. ఒక విధంగా తనలోని అసంతృప్తిని ఆయన మీడియా ముఖంగా వెల్లడించారు. అమరుల ఆకాంక్షలే తమ ప్రధాన అజెండా అని.. ప్రజాస్వామ్య పాలన అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. పొత్తులు బలంగా ఉండాలంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఉమ్మడి కార్యాచరణ, ప్రణాళిక అమలు, కూటమిలో గౌరవప్రదమైన భాగస్వామ్యమే తమ ప్రధాన అంశాలని పేర్కొన్నారు. అన్ని విషయాలూ తొందరగా తేల్చుకోవాలని తాము కోరుకుంటున్న మాట వాస్తవమేనని, రెండు రోజుల్లో తేల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తమకు సంకేతాలు అందాయని, ఆ సమయంలోపే అన్నీ సర్దుకుంటాయని తాము విశ్వసిస్తున్నట్టు ఆయన చెప్పారు.

తాను ఎన్నికల్లో పోటీచేయనని ఎక్కడా చెప్పలేదని.. పోటీ ఎక్కడ నుంచి అనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు. భాజపాలో చేరే ఆలోచన తనకు ఇప్పటి వరకూ లేదన్నారు. లీకులు, అసత్య వార్తలు గందరగోళానికి దారి తీస్తున్నాయని చెప్పారు. పొత్తులు, సీట్ల సర్దుబాటు తేలితే తప్ప గందరగోళానికి తెరపడదని స్పష్టం చేశారు.