kodandaram119 నియోజకవర్గాల్లోనూ ఒంటరిగానే బరిలోకి దిగుతాం అని చెప్పుకొస్తున్న కోదండరాం.. ‘ముందస్తు’ ప్రచార నేపథ్యంలో పొత్తుల విషయంలో కొంచెం మెత్తబడినట్టుగా కనిపిస్తున్నారు. కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, బీఎల్‌ఎఫ్‌ సహా ఏ పార్టీతో తెలంగాణ జన సమితి జతకట్టినా.. ఎన్నికల సమరంలో మాత్రం కోదండరాం నేతృత్వంలోనే ముందుకు సాగాలనే షరతు ఉంటుందనీ, అందుకు అంగీకరించే పార్టీలతోనే ముందుకెళ్తామని పార్టీ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. అంటే కోదండరామ్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలా?

ఇప్పటికే 25 నియోజకవర్గాలను ఎంచుకొని.. ఆ స్థానాల్లో పార్టీని పటిష్ఠపరిచే దిశగా కృషిచేస్తున్నటు వర్గాలు చెబుతున్నాయి. వేర్వేరు పార్టీలు, ప్రజాసంఘాలతో కలిసి సీపీఎం ‘బహుజన వామపక్ష వేదిక(బీఎల్‌ఎఫ్‌)’గా ముందుకెళ్తుండగా.. తెరాస ఓటమే లక్ష్యంగా తెదేపా, తెజస, ఇతర కొన్ని పార్టీలు, ప్రజాసంఘాలతో కలిసి మరో వేదికను ఏర్పాటుచేయడానికి సీపీఐ సన్నాహాలు చేస్తోంది.

బహుజన వామపక్ష వేదిక జనసేనతో కూడా చర్చలు జరుపుతుంది. అయితే అన్ని పక్షాలు కలిసి కాకుండా విడివిడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి అధికార పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే తెలంగాణలో మహాకూటమి అవకాశాలు కనిపించడం లేదు. వారికి సమయం ఇవ్వకూడదనే కేసీఆర్ ముందస్తుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది.