Kodali_Nani_YS_Vivekananda_Reddy_Murderవైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి సుమారు నాలుగేళ్ళవుతోంది. ఈ కేసుపై సీబీఐ, ప్రతిపక్షాలు వైసీపీ నేతలపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇంతకాలంగా వైసీపీలో ఎవరూ నోరువిప్పలేదు. వారి ఆరోపణలకి జవాబు చెప్పే ప్రయత్నం చేయలేదు. ఏమంటే కేసు కోర్టు పరిధిలో ఉంది కనుక మౌనంగా ఉండిపోవలసి వచ్చిందని సమర్ధించుకోవచ్చు. కానీ నిన్న హటాత్తుగా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని వివేకా హత్య గురించి మాట్లాడుతూ ఓ విచిత్రమైన వాదన వినిపించారు.

సోమవారం రాత్రి ఆయన తాడేపల్లిలో సిఎం క్యాంప్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ, “వివేకా చనిపోవడం లేదా హత్య వలన జగన్‌కి ఏమైనా ఆస్తి వచ్చిందా?ఆయనని చనిపోతే ఊళ్ళో జనాలకి కాఫీలు, టీలు, భోజనాల ఖర్చు తప్పిస్తే వివేకా ఆస్తిలో జగన్‌కి ఐదు పైసల బిళ్ళ కూడా రాలేదు. వివేకా ఆస్తి అంతా ఆయన కుమార్తె, అల్లుడికే వెళ్ళింది కదా?

వివేకా చచ్చిపోతే జగన్‌కి ముఖ్యమంత్రి పదవి పదవి వచ్చిందా?పార్టీ అధ్యక్షుడి పదవి వచ్చిందా? ఏమీ రాలేదు కదా?జగన్మోహన్ రెడ్డిగారు వైఎస్సార్ పార్టీ పెడితే వివేకానంద రెడ్డి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరపున పులివెందుల నుంచి విజయమ్మగారి మీద పోటీ చేశాడాయన. వివేకానందరెడ్డి కుటుంబమే జగన్‌ కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బ తీయాలని ప్రయత్నించింది.

వివేకానంద రెడ్డి మా పార్టీ వ్యవస్థాపకుడు కాదు… ఆయనేమీ మా పార్టీ ఆదర్శనాయకుడు కాడు. ఆయన జగన్‌ చేయి పట్టుకొని నడిపించలేదు. ఆయన బ్రతికున్నా చనిపోయినా ఆ సీటుని అవినాష్ రెడ్డికే జగన్‌ ఇస్తారు. మరి వివేకాని హత్య చేయవలసిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఎందుకు?” అన్నారు. టిడిపి ఈ కేసుని తమ అధినేత సిఎం జగన్మోహన్ రెడ్డితో ముడిపెట్టి బురదజల్లే ప్రయత్నం చేస్తోందని కొడాలి నాని ఆరోపించారు.

ఇటీవల టిడిపి ‘జగనాసుర రక్తచరిత్ర’ పేరుతో ఓ పుస్తకం విడుదల చేసింది. దానికి కొడాలి నాని జవాబు చెప్పారు. ప్రతిపక్షాల ఆరోపణలని నీచరాజకీయాలనో శవ రాజకీయాలనో కొట్టిపడేయవచ్చు. కానీ సీబీఐ ఛార్జ్ షీట్ల మాటేమిటి? ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని హైదరాబాద్‌కి పిలిపించి ఎందుకు ప్రశ్నించిన్నట్లు?వివేకా కుమార్తె సునీతా రెడ్డి వైసీపీ నేతలని ఎందుకు వేలెత్తి చూపిస్తున్నారు?ఈ కేసు విచారణ ఏపీలో నిష్పక్షపాతంగా జరగడం లేదని ఆమె తెలంగాణకి మార్పించుకొన్న మాట వాస్తవం కదా?

“వివేకాని చంపితే మాకేమి వచ్చింది?”అంటూ కొడాలి నాని మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే మళ్ళీ మీడియాలో దీనిపై వార్తలు, చర్చలు మొదలవుతాయి కదా?ఎప్పుడో చనిపోయిన వివేకాని ఈవిదంగా కించపరుస్తూ మాట్లాడటం ద్వారా వైసీపీ ఏం సాధించాలనుకొంటోంది?