Kodali Nani winning chances in gudiwadaగుడివాడ నియోజకవర్గానికి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు కొడాలి నాని. మొదట రెండు సార్లు టీడీపీ నుండి ఎన్నికైన ఆయన, 2014 ఎన్నికల ముందు వైఎస్సాఆర్ కాంగ్రెస్ లో చేరి మళ్ళీ గెలిచారు. ఎన్టీఆర్ రికమండేషన్ తో టీడీపీలోకి వచ్చిన నాని ఆ తరువాత పార్టీ నుండి బయటకు వెళ్లిపోవడంతో ఎన్టీఆర్ మీద కూడా అపవాదు వేశారు. బయటకు వచ్చిన నాటి నుండి ఏదో పుట్టిన నాటి నుండి తాను వైఎస్ విధేయుడిని అన్నట్టు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పై విమర్శలు చెయ్యడంతో ఆయన ఆగర్భ శత్రువు అన్నట్టు భావిస్తారు టీడీపీ వారు.

దీనితో ఆయనను ఎలాగైనా ఈ సారి ఓడించాలని టీడీపీ కృతనిశ్చయంతో ఉంది. కాకపోతే టీడీపీకి గుడివాడలో సరైన నేత లేకపోవడం నానికి కలిసొచ్చే అంశం. దీనితో విజయవాడ నుండు దేవినేని నెహ్రు కుమారుడు అవినాష్ ను రంగంలోకి దింపారు చంద్రబాబు. ఎక్కువగా డబ్బు ఖర్చుపెట్టగలిగే సత్తా ఉండడంతో అవినాష్ టీడీపీ శ్రేణులలో ఉత్సాహం నింపారు. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయినా రావి వెంకటేశ్వరరావును కూడా కలుపుకుని ముందుకు పోవడం విశేషం.

రావి ఎన్నికల ప్రచారంలో అవినాష్ రథాన్ని నడపడంతో శ్రేణులలో పెద్దగా ఇబ్బంది లేదనే చెప్పాలి. నియోజకవర్గంలోని కాపులను ఆకట్టుకోవడానికి వంగవీటి రాధా కూడా ఉపయోగపడుతున్నారు. అయితే నాన్ – లోకల్ ఫ్యాక్టర్ అవినాష్ కు ఇబ్బంది కలిగించేది. దీనికోసం ఆయన గుడివాడలో ఇల్లు తీసుకుని గృహప్రవేశం చేశారు. వరుసగా మూడు సార్లు గెలిచినా మూడు సార్లూ ప్రతిపక్షంలో ఉండడంతో గుడివాడలో పెద్దగా అభివృద్ధి జరగలేదు. ఇది నానికి కొంత ప్రతికూల అంశం. అయితే ఈ సారి గెలిస్తే తనకు జగన్ క్యాబినెట్ లో మంత్రిపదవి గారంటీ అని మరొక్కసారి అవకాశం ఇవ్వాలని నాని ప్రజలని అడుగుతున్నారు. దీనితో ఏం జరగబోతుంది అనేది చూడాలి.