kodali nani warning to Purandeswariమాజీ మంత్రి కొడాలి నాని మాజీ కేంద్రమంత్రి, బిజెపి నేత దగ్గుబాటి పురందేశ్వరికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఆయన నిన్న గుడివాడలో మీడియాతో మాట్లాడుతూ, “గుడివాడలో భీమవరం, మచిలీపట్నం రెండు రైల్వే క్రాసింగ్స్ ఉన్నాయి. ఒక రైల్వే గేటు గుండా రోజుకి 45 రైళ్ళు, మరో దాని గుండా 20-25 రైళ్ళు తిరుగుతుంటాయి. కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రెండు గేట్లలో ఒకటి తెరుచుకొన్నప్పుడు రెండోది మూసుకొని ఉంటుంది. అది తెరుచుకొన్నప్పుడు మొదటిది మూసుకొని ఉంటుంది. ఈ రెండు రైల్వే గేట్ల వలన గుడివాడలో సుమారు 1.80 లక్షల మంది ప్రజలు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ సమస్యను పరిష్కరించాలని మా ఎంపీ అరుణ్ శౌరి, సిఎం జగన్మోహన్ రెడ్డి అందరూ కేంద్రమంత్రి నితిన్ గడ్కారీని కలిసి బ్రతిమలాడితే, ఏడాదిన్నర తరువాత ఆ రెండు గేట్ల మీదుగా ఫ్లైఓవర్లు మంజూరు చేశారు. ఆయనే విజయవాడ వచ్చి దానికి శంకుస్థాపన చేశారు. ఫ్లైఓవర్‌ నిర్మాణానికి టెండర్లు కూడా పిలిచాము.

కానీ ఆ ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ పురందేశ్వరి కేంద్రమంత్రి నితిన్ గడ్కారీకి లేఖ వ్రాశారు. ఎందుకంటే ఆ రైల్వే గేట్ల వద్ద ఉన్న ఓ పెట్రోల్ బాంకు, ఓ కార్ల షోరూమ్, కొన్ని దుకాణాలకు నష్టం వాటిల్లుతుందట! కనుక ప్రజా ప్రయోజనాల కోసం ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని ఆపాలని ఆమె కోరుతూ కేంద్రమంత్రికి లేఖ వ్రాశారు. అంతే కాదు.. ఆమె దీని కోసం మంగళవారం ఢిల్లీ వెళ్ళి కేంద్రమంత్రిని స్వయంగా కలిసి ఫ్లైఓవర్‌ను ఆపాలని కోరబోతున్నారు.

గుడివాడలో ఎలాగూ బైపాస్ రోడ్డు నిర్మిస్తున్నారు కనుక ఫ్లైఓవర్‌ నిర్మించవలసిన అవసరం లేదని ఆమె చెప్పబోతున్నారుట! అయితే బైపాస్ రోడ్డు పడినా గుడివాడలోకి ప్రవేశించాలంటే మళ్ళీ ఇవే రైల్వే గేట్ల గుండా రావలసి ఉంటుంది. కేంద్రమంత్రిగా పనిచేసిన పురందేశ్వరి ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఫ్లైఓవర్‌ను అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

ఆమె ఓ పార్టీకి చెందినవారి పెట్రోల్ బాంకు, కార్ల షోరూమ్ గురించే ఆలోచిస్తున్నారు తప్ప గుడివాడలో నివశిస్తున్న 1.80 లక్షల మంది ప్రజలు పడుతున్న కష్టాల గురించి ఆలోచించడం లేదు. నేను ఇదే విషయమై ఆమెతోనే మాట్లాడే ప్రయత్నం చేశాను కానీ ఆమె ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు. కనుక మీడియా ద్వారా ఈ ప్రయత్నం మానుకోవలసిందిగా ఆమెకు విజ్ఞప్తి చేస్తున్నాను.

ఒకవేళ ఫ్లైఓవర్‌ నిర్మించకుండా ఆపేస్తే, మేము ఈ రెండు రైల్వే గేట్ల ద్వారా రైళ్ళు తిరగనీయకుండా రైల్‌ రోకో చేస్తాము. ఆమె ఎక్కడో హైదరాబాద్‌లో కూర్చొని నిర్ణయాలు తీసుకోవడం కాదు దమ్ముంటే గుడివాడకు వచ్చి ఇక్కడ ప్రజల ముందు నిలబడి ఫ్లైఓవర్‌ ఆపేస్తామని చెప్పాలి. అప్పుడు ప్రజలే ఏమి చేయాలో అది చేస్తారు,” అని కొడాలి నాని హెచ్చరించారు.