ysrcp-gudivada-nani-vs--avinash-devineniవైఎస్సార్ కాంగ్రెస్ గుడివాడ కోట కదులుతుంది. వరుసగా మూడు సార్లు గెలిచిన కొడాలి నాని ఈ సారి భయపడినట్టుగా కనిపిస్తున్నారు. గత మూడు సార్లు ఆయనకు వ్యతిరేకంగా సరైన అభ్యర్థి లేకపోవడంతో ఆయన గెలుపు సునాయాసం అయ్యింది. తొలుత చంద్రబాబు దేవినేని అవినాష్ ను గుడివాడ పంపినప్పుడు పిల్లోడు నాని ముందు ఏం నిలవగలడు లే అని అందరూ అనుకున్నారు. అయితే అవినాష్ మాత్రం నానికి చెమటలు పట్టిస్తున్నాడు. నియోజకవర్గంలో ఆణువణువూ తిరుగుతూ అక్కడ ఉన్న స్థానిక నేతలతో మమేకం అవుతున్నాడు.

వారందరిని ఒక్క తాటి మీదకు తెచ్చి ముందుకు నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో నాని, అవినాష్ ల మధ్య మాటల యుద్ధం కూడా జరుగుతుంది. అవినాష్ …లక్షల పెట్టి గుడివాడలో నాయకుల్ని కొంటున్నాడు అంటూ ఆరోపించారు కొడాలి నాని. అయితే ఈ ఆరోపణకు అంతే పదునుగా సమాధానము చెప్పాడు అవినాష్. “అలా అయితే వాడిని…వీడిని ఎందుకు నీ రేటు చేప్పు…నిన్నే కొంటా…అమ్ముడుపోవడం నీకు అలవాటేగా,” అంటూ నానిని ఎద్దేవా చేశారు.

వరుసగా మూడు సార్లు గెలిచినా మూడు సార్లూ ప్రతిపక్షంలో ఉండడంతో గుడివాడలో పెద్దగా అభివృద్ధి జరగలేదు. ఇది నానికి ప్రతికూల అంశంగా తయారయ్యింది. అయితే ఈ సారి గెలిస్తే తనకు జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రిపదవి గారంటీ అని మరొక్కసారి అవకాశం ఇవ్వాలని నాని ప్రజలని అడుగుతున్నారు. మొత్తానికి అవినాష్ రాకతో గుడివాడ రాజకీయం రసకందాయంలో పడింది. ఈ ఆసక్తికరపోరులో ఎవరు విజయం సాధిస్తారు అనేది తెలియాలంటే మే 23 వరకూ ఆగాల్సిందే.