Kodali Nani joining TDPవైసీపీలో కీలక నేతగా ఎదిగి, కృష్ణాజిల్లాలో అధికార పక్షంపై పోరాడుతున్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (కొడాలి నాని) జగన్ తీరుతో అలసిపోయారా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. దివంగత ఎన్టీఆర్ కు వీరాభిమాని అయిన కొడాలి నాని… ఎన్డీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ మరియు ఈయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ లకు అత్యంత సన్నిహితుడు అన్న విషయం తెలిసిందే.

అటు సినిమాల్లోనే కాక, ఇటు రాజకీయ రంగంలోనూ హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లను సంప్రదించకుండా కొడాలి నాని అడుగు ముందుకేయడని రాజకీయ వర్గాల్లో టాక్. … 2014 ఎన్నికలలో వైసీపీ తరపున పోటీ చేసినప్పటికీ, ఎన్టీఆర్ వీరాభిమానిగా ముద్రపడ్డ కొడాలి నాని విజయం సాధించారు. అయితే వైసీపీ ప్రతిపక్షంలో… టీడీపీ అధికారం పక్షంలో కూర్చుంది.

ఇటీవల విజయవాడలో తన గురువు హరికృష్ణతో కలిసి ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైన ఉదంతం రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. కొడాలి నానిని హరికృష్ణ తన కారులో కూర్చోబెట్టుకుని ఆ కార్యక్రమానికి తీసుకెళ్లడం, సదరు కార్యక్రమంలో కొడాలి నానికి బద్ధ శత్రువుగా పరిగణిస్తున్న దేవినేని ఉమామహేశ్వరరావు కూడా ఉండడం, అలాగే టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుతో మాట మంతి కలపడం హడావుడిగా ముగిసిపోయాయి.

ఈ సందర్భంగా కొడాలి నాని తిరిగి తన సొంత గూటికి చేరినట్లేనని జరిగిన ప్రచారంలో నిజం లేదని, తన ఆరాధ్య దైవం ఎన్టీఆర్ పేరిట ఆసుపత్రి నిర్మాణం, దానికి తన గురువు హరికృష్ణ నిధులిచ్చిన కారణంగానే కార్యక్రమానికి వచ్చానని, టీడీపీలోకి చేరే ఉద్దేశమేమీ లేదని ప్రకటించారు. అయితే తాజాగా చోటుచేసుకున్న ఓ కీలక ఘటన కొడాలి నాని నాడు చెప్పిన మాటలన్నీ ఉత్తుత్తివేనని ప్రచారం జరుగుతున్నాయి.

అధికార పార్టీ గూటికి చేరేందుకు కొడాలి నాని సన్నాహాలు చేసుకుంటున్నారన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ మేరకు గడచిన రెండు, మూడు రోజుల్లో టీడీపీకి చెందిన ఓ కీలక నేతను హైదరాబాదులో కలిసి తన మనసులోని మాటను బయటపెట్టినట్టు సమాచారం. ఎన్టీఆర్ సొంతూరు గుడివాడలో టీడీపీ జెండా ఎగరాల్సిందేనని బలంగా భావిస్తున్న సదరు కీలక నేత… కొడాలి నాని ప్రతిపాదనకు సానుకూలంగానే స్పందించినట్లు విశ్వసనీయ సమాచారం.

అయితే కొడాలి నాని నిండు సభ సాక్షిగా… సిఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావులపై చేసిన ఘాటు వ్యాఖ్యలను జీర్ణించుకోలేని టీడీపీ నేతలు మాత్రం నాని ఎంట్రీని అడ్డుకునే యత్నం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఎన్టీఆర్ సొంత ఊరికి సంబంధించిన వ్యవహారం కావడంతో సదరు నేతలంతా కొడాలి నాని రీఎంట్రీకి తలూపక తప్పదని ఆ కీలక నేత వాదిస్తున్నారు. ఈ క్రమంలో త్వరలోనే కొడాలి నాని… టీడీపీలో చేరడం ఖాయంమన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.