Kodali Nani Fires on TDP supporting media ఇటీవలే జరిగిన ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ సంచలన విజయం నమోదు చేసింది. 175 స్థానాలు కలిగిన అసెంబ్లీలో 151 సీట్లు సాధించడం అంటే చరిత్ర అన్నట్టే. సహజంగా అటువంటి విజయం సాధించిన ప్రభుత్వానికి తిరుగుండదు. అయితే ఆశ్చర్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ మంత్రులు భేల మాటలు మాట్లాడడం విచిత్రంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే…. పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆ తరువాత మీడియాతో మాట్లాడారు.

“ముఖ్యమంత్రి జగన్ ను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని కొన్ని మీడియా సంస్థలు రకరకాల ముసుగుల్లో దూరి ప్రయత్నాలు చేస్తున్నాయి. జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు కుట్ర జరుగుతోంది,” అంటూ ఆరోపించారు నాని. 23 ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీ జగన్ ప్రభుత్వాన్ని ఎలా అస్థిరపరచగలదు? అసలు ప్రభుత్వం అస్థిరపడాలి అంటే కనీసం 75 మంది ఎమ్మెల్యేలు తమ మనసు మార్చుకోవాలి. జగన్ పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేలు కొత్త వారే… జగన్ చరిష్మాతో గెలిచిన వారే. వారు అంతటి సాహసం చెయ్యరు.

పైగా ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కూడా కాకుండా అటువంటి పని ఎవరూ చెయ్యరు. అంత మెజారిటీతో గెలిచి ఇటువంటి భేల మాటలు మాట్లాడడం ఏంటి? అది కూడా కొడాలి నాని వంటి జగన్ కు బాగా సన్నిహితులుగా పేరొందిన వారు. ప్రజలలో సింపతీ కోసం అన్నారా? లేక ప్రభుత్వం టీడీపీ చేస్తున్న ఎదురుదాడికి ఇబ్బంది పడుతుందా? ఈ ప్రశ్నలకు వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు ఓటుకు నోటు కేసును చూపిస్తున్నారు… అయితే దాని వల్ల జరిగిన నష్టంతో టీడీపీ గానీ ఇంకొకరు గానీ అటువంటి సాహసం చేసే ధైర్యం చేసే పరిస్థితి ఉందా?