Kodali-Nani కోటంరెడ్డి, ఆనం రెడ్డి, రఘురామ రాజు వీరందరిలో ఓ కామన్ పాయింట్ ఉంది. వీరందరూ వైసీపీ లేదా దాని అధినేత జగన్మోహన్ రెడ్డితో అనుబందం ఉన్నవారే. ఇక షర్మిల ముందుగా వెళ్ళిపోగా, విజయమ్మ తర్వాత వెళ్ళిపోయారు. ఏ పార్టీలో అయినా నేతలు బయటకి వెళ్ళిపోవడం సాధారణమే. కనుక ఇటువంటివి పక్కనపెడితే, ఓ సారి పార్టీలో నుంచి బయటకి వెళితే వారితో వైసీపీ ఏవిదంగా వ్యవహరిస్తుందనేది అందరూ చూస్తూనే ఉన్నారు.

రఘురామకి అరికాళ్ళు వాచిపోగా, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ‘దుష్టుడు, దుర్మార్గుడు, ద్రోహి’ ముద్రలు పడిపోయాయి. ఇవి కూడా సర్వసాధారణమే అని సరిపెట్టుకొన్నా, ఎప్పుడో చనిపోయినా వివేకానంద రెడ్డిని కూడా వైసీపీ విడిచిపెట్టకపోవడం దిగ్బ్రాంతి కలిగిస్తుంది. ఆయన హత్య కేసుని టిడిపి రాజకీయ అస్త్రంగా తమ పార్టీపై ప్రయోగిస్తోందని గ్రహించినప్పుడు, దానిని రాజకీయంగా ఏవిదంగా ఎదుర్కోవాలని వైసీపీ ఆలోచించాలి. కానీ చనిపోయిన వివేకానందరెడ్డిని ఆయన కుటుంబ సభ్యుల పట్ల వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అనుచితంగా మాట్లాడటం దిగ్బ్రాంతి కలిగిస్తుంది. తమ అధినేత జగన్మోహన్ రెడ్డిని, విజయమ్మని రాజకీయంగా దెబ్బ తీయాలని ప్రయత్నించారని కొడాలి నాని చెప్పడం చూస్తే వైసీపీకి నష్టం వస్తుందని భావిస్తే ఎవరికీ మినహాయింపు ఉండబోదని అర్దం అవుతోంది.

అయితే తమ అధినేతని వెనకేసుకు వచ్చే ప్రయత్నంలో కొడాలి మాట్లాడిన మాటలు ప్రజలకి తప్పుడు సంకేతాలు కూడా పంపిన్నట్లయింది. ఇప్పటికే వివేకా హత్య కేసుతో వైసీపీని ఇరుకున పెడుతున్న టిడిపి, కొడాలి నాని మాట్లాడిన మాటలని కూడా అస్త్రంగా ఉపయోగించుకొని ఎదురుదాడి చేస్తోంది.

“హూ కిల్డ్ బాబాయ్?” అనే టిడిపి ప్రశ్నకి సీబీఐ జవాబు కనుక్కొంటుందేమో?కనుక ప్రస్తుతానికి ఆ ప్రశ్నని పక్కన పెడితే, వైసీపీలో నుంచి ఎవరైనా బయటకి వెళితే వారిని వైసీపీ ఏవిదంగా ట్రీట్ చేస్తుందో కొడాలి నాని మరోసారి చాటి చెప్పారు. కనుక పులిమీద సవారీ చేస్తున్న వైసీపీ నేతలందరూ దిగే ముందు కాస్త ఆలోచించుకోవడం చాలా అవసరం.