kodali nani తెలంగాణ సిఎం కేసీఆర్‌ బిఆర్ఎస్‌ పార్టీతో ఏపీలో కూడా ప్రవేశించబోతున్నారనే వార్తలపై ఇంతవరకు టిడిపి నేతలెవరూ స్పందించలేదు కానీ వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా మంది స్పందిస్తున్నారు! అంటే బిఆర్ఎస్‌ రాకతో తమ పార్టీకి నష్టం జరుగుతుందని వారు ఆందోళన చెందుతున్నట్లు అర్దమవుతోంది. ఇంతకాలం టిడిపి, జనసేనలు ఎక్కడ పొత్తు పెట్టుకొంటాయో అని భయపడుతూ అవి దగ్గరవకుండా ఉంచేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ నేతలకు ఇప్పుడు బిఆర్ఎస్‌ మరో కొత్త సవాలుగా నిలువబోతుండటంతో వారు ఆందోళన చెందడం సహజమే.

మాజీ మంత్రి కొడాలి నాని నిన్న గుడివాడలో గడప గడపకి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మీడియాతో మాట్లాడుతూ, “దేశంలో ఎవరైనా ఎక్కడైనా పార్టీలు పెట్టుకోవచ్చు. కనుక కేసీఆర్‌ కూడా బిఆర్ఎస్‌ పెట్టుకొన్నారు. ఆయన పార్టీ ఏపీలో కూడా పోటీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మంచిదే. రాష్ట్ర విభజన తర్వాత కూడా సెటిలర్లు టిఆర్ఎస్‌కు మద్దతు ఇస్తున్నారు. కనుక ఏపీలో కూడా తన హవా సాగుతుందని కేసీఆర్‌ భావిస్తున్నట్లున్నారు. అయితే ఏపీలో బిఆర్ఎస్‌కి అభ్యర్ధులు దొరుకుతారా?రాష్ట్ర ప్రజల అభీష్టానికి విరుద్దంగా ధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన ఆయనను ఏపీ ప్రజలు అదరిస్తారా?ఏపీ వెనకబాటుతనానికి కేసీఆర్‌ కారణం కాదా?అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెపుతుంది. చంద్రబాబు నాయుడు తెలంగాణలో టిడిపిని పోటీ చేయిస్తూ తనది జాతీయపార్టీ అని చెప్పుకొంటున్నట్లే కేసీఆర్‌ కూడా బిఆర్ఎస్‌తో ఏపీలో పోటీ చేసి తనది జాతీయపార్టీ అని చెప్పుకోవాలనుకొంటున్నారేమో?” అని అన్నారు.

మంత్రిగా చేసిన కొడాలి నాని ఇన్ని రోజులకు ఏపీ వెనుకబడి ఉందనే వాస్తవాన్ని తన నోటితోనే దృవీకరించారు. నేడు ఏపీ ఈ దుస్థితిలో ఉండటానికి కేసీఆర్‌ కారణమని ఆయన ఎందుకు నిందిస్తున్నారు?రాష్ట్ర విభజన చేసినందుకా? లేదా హైదరాబాద్‌ తెలంగాణకు వెళ్ళిపోయిందనా?అంటే కాదనే చెప్పవచ్చు.

రాష్ట్ర విభజన వలన ఏపీ చాలా తీవ్రంగా నష్టపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఆ సమస్యలన్నిటినీ ఒకటొకటిగా అధిగమించి రాష్ట్రానికి చాలా బలమైన పునాదులే వేశారు. ఒకవేళ మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అయ్యుంటే తాను మొదలుపెట్టిన పనులన్నీ పూర్తిచేసి ఉండేవారు. దాంతో రాష్ట్రాభివృద్ధి జరిగి ఉండేది కదా?

కానీ హైదరాబాద్‌కు ధీటుగా అమరావతి ఎదిగితే హైదరాబాద్‌కు రావలసిన పరిశ్రమలు, పెట్టుబడులు అన్నీ అక్కడికి తరలిపోతాయనే ఆలోచనతోనే కేసీఆర్‌ మూడు రాజధానుల ప్రతిపాదనతో వచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్ని విదాలా తోడ్పడ్డారు. తత్ఫలితంగా నేడు రాష్ట్రంలో ఎటువంటి దుస్థితి నెలకొందో అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు ఏపీ దుస్థితికి వారిద్దరూ కారకులే అని ప్రజలు భావిస్తున్నారు. అయితే మంత్రిగా చేసిన కొడాలి నాని అప్రయత్నంగా తమ ప్రభుత్వ వైఫల్యాన్ని ఈవిదంగా ధృవీకరించుకోవడమే విశేషం.