Kodali Nani about Amaravatiముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పలుకును నేరుగా వినపించరన్న విషయం తెలిసిందే. వివాదం వచ్చిన ప్రతిసారి ప్రభుత్వం తరపున వివరణ ఇచ్చేందుకు సకల శాఖా మంత్రిగా పిలిచే సజ్జల రామకృష్ణారెడ్డి గానీ, పేర్ని నాని గానీ, కొడాలి నాని గానీ, బొత్స గానీ వివరణ ఇవ్వడం పరిపాటిగా మారిపోయింది.

తాజాగా అమరావతి విషయంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై నేరుగా ఒక్క మాట కూడా మాట్లాడని వైసీపీ వర్గం, సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు మాత్రం సుముఖత చూపుతోంది. సుప్రీంలో అంతిమ తీర్పు ఎవరికి అనుకూలంగా లభిస్తుంది అన్నది పక్కన పెడితే, రాజధాని అంశాన్ని మరికొన్నాళ్లపాటు అలా అభివృద్ధికి దూరంగా ఉంచడానికి మాత్రం ఉపయోగపడుతుంది.

బహుశా ఇదే ఆలోచనతో సుప్రీంకు వెళదామని యోచిస్తున్నారో ఏమో గానీ, అమరావతి రాజధానిగా ఉండడం అనేది వైసీపీ వర్గాలకు ఏ మాత్రం రుచించని అంశంగా మారిందన్నది సుస్పష్టం. ఈ విషయాన్ని బొత్స సత్యనారాయణ ఇప్పటికీ మూడు రాజధానులంటూ ప్రస్తావించి పరోక్షంగా తెలుపగా, కొడాలి నాని లాంటి వాళ్ళు అయితే నేరుగా మీడియా డిబేట్ లోనే తెలుపుతున్నారు.

ఇటీవల ఓ మీడియా ఛానల్ నిర్వహించిన డిబేట్ లో పాల్గొన్న మంత్రి కొడాలి నాని, విలేఖరి అడిగిన ప్రశ్నకు సూటిగా జవాబిచ్చారు. ‘అమరావతి రాజధానిగా ఉండడం మీకు ఇష్టమా? కాదా?’ అని సంబంధిత మీడియా ప్రతినిధి అడుగగా, ‘నాకు ఇష్టం లేదు’ అంటూ నిస్సంకొంచెంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.

అయితే ఇది కేవలం మన బూతుల మంత్రిగా టీడీపీ పిలిచే కొడాలి నాని వ్యక్తిగత అభిప్రాయమా? లేక పార్టీ పరంగా అంతర్గతంగా తీసుకున్న నిర్ణయాన్ని పరోక్షంగా వెల్లడిస్తున్నారా? అనేది మాత్రం అధికారికంగా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా అమరావతి రాజధానిగా ఉండాలని మరియు రాజధాని అభివృద్ధి ఆరు నెలల్లో శరవేగంగా జరగాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ వర్గం ఏ మాత్రం సంతోషంగా లేదన్నది సుస్పష్టమైంది.

నాడు 2019 ఎన్నికల ప్రచారంలో అమరావతి రాజధానిగా ఉండడం మాకు ఇష్టమే, దాని అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పిన జగన్ మాటలకు, నేడు అధికారం చేపట్టి మూడు సంవత్సరాలు గడుస్తున్నా, ఇటుక పేర్చకుండా చేస్తోన్న పాలనకు ఎక్కడా పొంతన లేకుండా పోతోంది. ఆఖరికి కోర్టు తీర్పులను కూడా బేఖాతరు చేయడం, సీబీఐలను కూడా నిందించడం అనేది వైసీపీ మార్క్ పాలనకు అద్దం పడుతోంది.