KKR VS KX1P 2017 IPLఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా గురువారం నాడు కోల్ కతా వేదికగా జరిగిన మ్యాచ్ లో నైట్ రైడర్స్ జట్టు ఈజీ విక్టరీని సొంతం చేసుకుని, పాయింట్ల పట్టికలో అగ్రస్థానం దక్కించుకుంది. వరుసగా రెండు విజయాలతో మాంచి ఊపు మీదున్న పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుకు గట్టి షాక్ నిచ్చే విధంగా కోల్ కతా చెలరేగి ఆడింది. టాస్ గెలిచి బౌలింగ్ చేపట్టిన నైట్ రైడర్స్ జట్టు, మ్యాచ్ లో పట్టు సాధించడానికి పంజాబ్ కు ఒక్క అవకాశాన్ని కూడా ఇవ్వలేదు.

కింగ్స్ ఎలెవన్ జట్టులో బ్యాట్స్ మెన్లు కనీసం 30 పరుగులు కూడా ఎవరూ దాటలేదంటే… ఎంత కట్టుదిట్టమైన బౌలింగ్ వేసారో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉమేష్ యాదవ్ మిడిలార్డర్ లో వికెట్లు తీసి, భారీ స్కోర్ చేయాల్సిన పంజాబ్ ను కేవలం 170 పరుగులకే నియంత్రించాడు. మొత్తంగా 4 కీలక వికెట్లు తీసిన ఉమేష్ యాదవ్, మ్యాచ్ లో కీలక భూమిక పోషించాడు. దీంతో కింగ్స్ ఎలెవన్ గౌరవప్రదమైన స్కోర్ తో మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఇక లక్ష్య చేధనలో నైట్ రైడర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ముఖ్యంగా స్పిన్నర్ నరైన్ ను ఓపెనర్ గా దించుతూ చేసిన ప్రయోగం గ్రాండ్ సక్సెస్ సాధించింది. కేవలం 18 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేసి పంజాబ్ బౌలింగ్ ను తుత్తునియలు చేసాడు. మరో ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఏమి తక్కువ తినలేదు అన్నట్లుగా… 49 బంతుల్లో 11 ఫోర్లతో 72 పరుగులతో నాటౌట్ గా నిలిచి, జట్టును స్వయంగా విజయతీరాలకు చేర్చాడు. వీరిద్దరి బ్యాటింగ్ తో కేవలం 16.3 ఓవర్లలోనే నైట్ రైడర్స్ 170 పరుగుల లక్ష్యాన్ని చేధించింది.

ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో విజయపు అంచుల దాకా వచ్చి ఓటమి పాలైన నైట్ రైడర్స్ జట్టు, ఆ కసినంతా పంజాబ్ పై చూపించినట్లుగా ఆడారు. దీంతో మెరుగైన నెట్ రన్ రేట్ తో ఏకంగా అగ్ర స్థానాన్ని అందుకున్నారు. ఈ సీజన్ తొలిరోజులే అయినప్పటికీ, కోల్ కతా, హైదరాబాద్, పంజాబ్, ముంబై ఇండియన్స్ జట్లు మంచి ప్రారంభాన్ని అందుకున్నాయి. ఈ నాలుగు జట్లు ఆడిన 3 మ్యాచ్ లలో 2 విజయాలను చవిచూసి 4 పాయింట్లతో టాప్ 4 స్థానంలో నిలిచాయి.