Kishore Chandra Deo joining tdpమాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్‌ పార్టీకి ఇటీవలే రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీకి పంపారు. కిశోర్‌ చంద్రదేవ్‌ ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఒకసారి రాజ్యసభ సభ్యునిగా చేశారు. దాదాపు 30 ఏళ్లు ఆయన పార్లమెంటులో గడిపారు. ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. కిషోర్ చంద్రదేవ్ 1977లో మొదటిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన కొండ దొర సామాజికవర్గం.

ఎస్టీ రిజర్వ్‌డ్‌ లోక్‌సభ స్థానం పార్వతీపురం నుంచి గతంలో పోటీ చేశారు. ఆ తరువాత అరకులోయ నియోజకవర్గం ఏర్పాటుకాగా 2009లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి గెలిచారు. ఎంపీగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే ఆయనకు సహాయ మంత్రి పదవి లభించింది. మైన్స్‌, స్టీల్‌, కోల్‌ మంత్రిగా చేశారు. ఆ తరువాత 2011-14 మధ్య రాజ్యసభ సభ్యునిగా చేశారు. అప్పుడు కేంద్ర గిరిజన సంక్షేమ, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వరించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు.

ఇప్పటికే ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో అరకులోయ ఎంపీగా తెలుగుదేశం పార్టీ బలమైన అభ్యర్థిని నిలపాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఆయనను అక్కడ నుండి పోటీ చేయించబోతున్నట్టు సమాచారం. ఆయన రాకను తెలుగుదేశం వర్గాలు ఆహ్వానిస్తున్నాయి. గత ఎన్నికలలో ఎస్టీ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. అక్కడ పార్టీని బలోపేతం చేయడంపై టీడీపీ దృష్టిసారించింది. కిషోర్ చంద్రదేవ్ జాయిన్ అయితే పార్టీ బలోపేతం అవుతుందని వారి అంచనా.