Kishan Reddy Oath in Telugu in Lok Sabha మొన్న ఆ మధ్య మంత్రిగా ప్రమాణం చేసిన కిషన్ రెడ్డి హిందీలో చెయ్యడంతో విమర్శలు వచ్చాయి. పైగా ఆ సందర్భంగా ఒక చోట తడబడటంతో రాష్ట్రపతి ఆయనను కరెక్టు చేశారు. దీనితో కిషన్ రెడ్డి పంథా మార్చారు. 17వ లోక్‌సభకు సికింద్రాబాద్ నుంచి ఎన్నికైన కిషన్ రెడ్డి ఇవాళ ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్‌ వీరేంద్ర కుమార్‌.. కిషన్‌రెడ్డి చేత ప్రమాణం చేయించారు. గత,లో హిందిలో ప్రమాణం చేసిన ఆయన ఈసారి మాత్రం తెలుగులోనే ప్రమాణ పత్రం చదివారు.

జూలై 26వ తేదీ వరకు కొనసాగే లోక్‌సభ సమావేశాల్లో తొలి రెండు రోజులు ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అంతక ముందు ఇవాళ తొలుత ప్రధాన మంత్రి మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తర్వాత కేంద్ర మంత్రులు ప్రమాణం చేశారు. తరువాత మిగతా ఎంపీలు వరుసక్రమంలో ప్రమాణస్వీకారం చేస్తున్నారు. కిషన్ రెడ్డి కి హోమ్ శాఖ సహాయ మంత్రి పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఉన్న ఎంఐఎంకు ధీటుగా బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా తీర్చి దిద్దడానికి ఆ పదవి ఇచ్చినట్టు సమాచారం.

సామాన్య కార్యకర్తగా పార్టీలో చేరిన కిషన్‌రెడ్డి కేంద్రమంత్రి స్థాయికి ఎదిగారు. 2004లో హిమాయత్‌నగర్‌ శాసనసభ స్థానం నుంచి తొలిసారిగా పోటీ చేసి గెలుపొందారు. నియోజకవర్గాల పునర్‌విభజనలో భాగంగా హిమాయత్‌నగర్‌ అసెంబ్లీ స్థానం అంబర్‌పేటలోకి వచ్చింది. 2009, 2014లో అంబర్‌పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 2004, 2009, 2014లో వరుసగా గెలుపొంది హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. అయితే 2018 డిసెంబర్ లో జరిగిన ఎన్నికలలో అనూహ్యంగా స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే ఆ ఓటమే ఆయన పాలిట వరం అయ్యింది. నాలుగు మాసాల అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కిషన్‌ రెడ్డి సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి అధికార తెరాస అభ్యర్థిపై 62,144 ఓట్ల మోజార్టీతో విజయం సాధించారు.