Kiran Kumar Reddy Political Re-Entryఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని విభేదించి, ‘జై సమైక్యాంధ్ర’ పేరుతో పార్టీ స్థాపించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గురించి చెప్పేదేముంది. సొంత పార్టీ స్థాపించినా, అప్పటి రాజకీయ పరిస్థితులను గమనించి, పోటీ నుండి తప్పుకుని పరోక్షంగా తెలుగుదేశం – బిజెపిలకు మద్దతు పలికిన కిరణ్ కుమార్ రెడ్డి, మళ్ళీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారన్న వార్తలు చాలా కాలం నుండి హల్చల్ చేస్తున్నాయి. గత రెండున్నర్రేళ్ళుగా తనకు కావాల్సిన ఆట ఆడుకుంటూ జీవితాన్ని హాయిగా గడుపుతున్న కిరణ్ కుమార్ రెడ్డి రంగప్రవేశానికి ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది.

ప్రస్తుతం వ్యవసాయ పనులు చూసుకుంటున్న నల్లారి, చిత్తూరు జిల్లా, గుర్రంకొండ పంచాయితీకి రాగా, అక్కడ ఉన్న అభిమానులు, కార్యకర్తలను పలకరించారు. అయితే మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వాల్సిందిగా కోరినపుడు నల్లారి చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ‘ఏమన్నా… మమ్మల్ని ఏదొక పార్టీలోకి తోయండి… మీరు ఏమీ చెప్పకపోతే ఎలా…?’ అంటూ ఓ కార్యకర్త ప్రశ్నించగా, “ఇప్పటికే పెళ్లి కుదిరింది, పెళ్లికూతురు ఎవరన్నది రహస్యం, త్వరలోనే తాళిబొట్టు కట్టే ముహూర్తం ఖరారవుతుంది, శుభలేఖలు అందరికీ వస్తాయి, తొందరపడవద్దు” అని చెప్పడంతో సరికొత్త చర్చకు దారి తీసిన వారయ్యారు.

నల్లారి చేసిన ఈ కామెంట్స్ ఈ ‘సమైక్యాంధ్ర’ హీరో రీ ఎంట్రీని ధృవీకరిస్తుండగా, ఎవరిని పెళ్లి చేసుకుంటారా? అన్న విషయం ఆసక్తికరంగా మారింది. తన సామజిక వర్గానికి చెందిన పార్టీ వైపుకు మొగ్గు చూపుతారా? అధికారంలో ఉన్న పార్టీయే శ్రేయస్కరమనుకుంటారా? పూర్వం జాతీయ పార్టీలో అనుభవం ఉంది కాబట్టి, ఈ సారి కూడా జాతీయ పార్టీ అయితేనే బెటర్ అనుకుంటారా? ఏదీ కాకపోతే ఎలాగూ చచ్చిపోయిన పార్టీకి మళ్ళీ జీవం పోయాలనుకుంటారా? గతంలో అయితే బిజెపి పేరు బలంగా వినపడగా, ప్రస్తుతం మాత్రం పరిస్థితులు చాలా స్తబ్దుగా ఉన్నాయి. అయితే చివరి నిముషంలో ‘వరకట్నం’ విషయంలో తేడాలు వచ్చాయని ‘పెళ్లికూతురు’ మార్పు జరగవచ్చన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి.