Kiran Kumar Reddy back To Congress partyరాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరించి, వార్తల్లో నిలిచిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గత అయిదేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. విభజన జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన నల్లారి, చెప్పిన మాటకు కట్టుబడి పొలిటికల్ గా దూరమయ్యారు. అయితే ప్రస్తుతం మారిన పరిస్థితుల రీత్యా, బిజెపి కంటే కాంగ్రెస్ మేలు అన్న భావన ప్రజలలో ఏర్పడింది.

దీంతో రాష్ట్రంలో పూర్తిగా చచ్చుపడిపోయి ఉన్న కాంగ్రెస్ కు జీవం పోసేందుకు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నల్లారిని పార్టీలోకి ఆహ్వానించగా, అందుకు సమ్మతించి నేడు పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే నల్లారి వలన నిజంగా కాంగ్రెస్ కు ఉపయోగం ఉంటుందా? అంటే… కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చే సీన్ ఇప్పట్లో ఎవరికీ ఉండదు గానీ, గత అయిదేళ్ళతో పోలిస్తే, కాస్త కొత్త ఉత్తేజం మాత్రం ఉండే అవకాశం కనపడుతోంది.

గత ఎన్నికలలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పూర్తిగా పోయి, అందరూ డిపాజిట్లు కోల్పోయారు. కానీ నల్లారి ప్రచారం వలన ఆ డిపాజిట్లు దక్కే అవకాశం మాత్రం ఉంది. అంటే పరోక్షంగా ఓట్ల చీలికకు నల్లారి ప్రచారం సహకరించవచ్చు. అంతిమంగా అది ఏ పార్టీకి లబ్ది చేకూరుస్తుందన్నది ఫలితాల తర్వాత తెలిసే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ తరపున ధైర్యంగా ప్రచారం చేయడానికి నల్లారి రూపంలో ఓ అవకాశం దక్కిందని మాత్రం చెప్పవచ్చు.