Kiran Kumar Reddy as AICC presidentఏఐసీసీ అధ్యక్ష పదవిని మాజీ సిఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వనున్నారని డిల్లీలో ప్రచారం జరుగుతోంది. రాహుల్ గాంధీ రాజీనామా చేయడం, ఇతరులెవరూ ముందుకు రాకపోవడంతో ఆ పదవిని దక్షిణాది కాంగ్రెస్ నేతలకు ఇవ్వాలని కొందరు భావిస్తున్నారట. రాహుల్ కూడా అందుకు సముఖంగా ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి పేరు పరిశీలనలోకి వచ్చిందని సమాచారం. మాజీ ముఖ్యమంత్రి కావడం ఆయనకు ఉపయోగపడుతూ ఉంది.

గతంలో ఎపి ముఖ్యమంత్రులుగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డిలు ఎఐసిసి అధ్యక్షులుగా సమర్థవంతంగా పనిచేశారు. కిరణ్ అయితే ఇంగ్లిష్, హిందీలో కూడా మేనేజ్ చేయగలడు కాబట్టి, దక్షిణాది నేతల్లో ఆయననే కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేయవచ్చని కీలక వ్యక్తి ఒకరు చెప్పారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే రాష్ట్ర విభజన సమయంలో కిరణ్ కాంగ్రెస్ పార్టీతో విబేధించి సొంత కుంపటి పెట్టుకున్నారు. కాంగ్రెస్ ను ఆంధ్రప్రదేశ్ లో నాశనం చెయ్యడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పలువురు నేతలు అభిప్రాయపడుతూ ఉంటారు.

ఇటువంటి తరుణంలో ఆయనకు అవకాశమంటే ఆశ్చర్యమే. 2014లో తన సొంత పార్టీ ఘోరపరాజయంతో రాజకీయంగా స్తబ్దుగా ఉండిపోయారు. 2018లో కాంగ్రెస్ లో చేరినప్పటికీ ఆయన పార్టీలో క్రియాశీలకంగా లేరు. ఇటీవలే జరిగిన ఎన్నికలలో కూడా పోటీ చెయ్యలేదు. ఈ తరుణంలో ఆయన ఎంపిక వార్తలు నిజమైతే విశేషమే. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ఫలితాలు రాకముందే రాజీనామా చేసినా ఇప్పటివరకూ ఆ బాధ్యతలను తీసుకుని నడిపించే సమర్ధవంతమైన నాయకుడు లేకపోవడంతో రఘువీరా రాజీనామాను ఆమోదించలేదు పార్టీ హై కమాండ్.