Kiran Kumar Reddy about Three capitals Issueనందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్న ‘అన్‌స్టాపబుల్’ సీజన్-2 తొలి ఎపిసోడ్‌కి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని, నారా లోకేష్‌ని ఆహ్వానించి ఇంటర్వ్యూ చేయడంతో ప్రారంభం అదిరిపోయింది. ఆ మొదటి ఎపిసోడ్ గురించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చాలా రోజులు చర్చలు, వైసీపీ, టిడిపి నేతల మద్య వాదోపవాదాలు, విమర్శలు ప్రతివిమర్శలు సాగాయి కూడా. తాజా ఎపిసోడ్‌కి సమైక్య రాష్ట్ర చిట్టచివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌ రెడ్డిని బాలయ్య ఆహ్వానించారు.

దానిలో ‘మూడు రాజధానుల మీద మీ అభిప్రాయం ఏమిటనే’ బాలయ్య ప్రశ్నకు పూర్వ ముఖ్యమంత్రిగా తనకున్న అనుభవంతో కిరణ్ కుమార్‌ రెడ్డి చక్కటి సమాధానం చెప్పారు.

“ఒకప్పుడున్న పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి పనిచేస్తుంటాయి. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు సచివాలయంలో పనిచేసే ఉన్నతాధికారులు తప్పనిసరిగా అసెంబ్లీకి అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. అలాగే కోర్టుకి సంబందించిన పలు అంశాలపై ప్రభుత్వ న్యాయవాదులు, సంబందిత కేసుల అధికారులు ముఖ్యమంత్రి, మంత్రుల సంతకాలు, అనుమతులు, అభిప్రాయాలు, సూచనలు తీసుకోవలసి ఉంటుంది. మూడు వ్యవస్థలు ఒకదానితో ఒకటి ముడిపడి పనిచేస్తుంటాయి కనుక అన్నీ ఒకే చోట ఉండటం చాలా మంచిది,” అని అభిప్రాయం చేశారు.

ఇదే మాట చంద్రబాబు నాయుడు చెపితే రాజకీయ దురుదేశ్యంతో చెపుతున్నారనో లేదా రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేక చెపుతున్నారనో వైసీపీ నేతలు వితండవాదం చేసేవారు. కానీ ఒకప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్‌ రెడ్డి ఈ మాట చెప్పడంతో వైసీపీలో ఎవరూ స్పందించడం లేదు.

కానీ కిరణ్ కుమార్‌ రెడ్డి చెప్పినట్లు మూడు వ్యవస్థలు ఒకదానితో ఒకటి ముడిపడి పనిచేస్తున్నప్పుడు హైకోర్టు కర్నూలులో, పరిపాలన రాజధాని విశాఖలో, శాసన రాజధాని అమరావతిలో ఏర్పాటైతే అధికారులు, ఉద్యోగులు అందరూ నిత్యం ఈ మూడు ప్రాంతాల మద్య తిరుగుతూనే ఉండాలి.

ఉదాహరణకు గత ప్రభుత్వ హయాంలో అమరావతి కేంద్రంగా రాజధాని కొనసాగినప్పుడు, హైదరాబాద్‌లో స్థిరపడిన వేలాదిమంది సచివాలయ అధికారులు, ఉద్యోగులు ప్రతీరోజు రైళ్ళు, బస్సులలో వచ్చి వెళ్ళేవారు. అప్పుడు వారెన్ని అవస్థలు పడ్డారో, ఈ కారణంగా కార్యాలయాలలో పనులు జరుగక ఎంత ఆలస్యమవుతుండేదో అందరికీ తెలుసు. ఇప్పుడు మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, ఆన్‌లైన్‌ సేవలు, మూడు నగరాల మద్య తిరగడానికి విమానాలు కూడా అందుబాటులో ఉన్నప్పటికీ గోప్యత పాటించవలసిన అంశాలపై నిర్ణయాలు, చర్చలు తీసుకొనేందుకు లేదా ఫైళ్ళపై మంత్రులు, ఎమ్మెల్యేల సంతకాలు తీసుకొనేందుకు నేరుగా హాజరుకావలసిందే. కనుక మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే మళ్ళీ అవే రకమైన సమస్యలు మొదలవుతాయి. అధికారులు, ఉద్యోగులకు పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది కూడా.

అయినా గత రెండు మూడు నెలలుగా విశాఖ రాజధాని, కర్నూలు న్యాయరాజధాని అంటూ తెగ హడావుడి చేసిన మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారు ఎందుకో? అంటే రాజకీయకారణంతోనే వారు హడావుడి చేస్తుంటారు తప్ప మూడు రాజధానులపై కూడా వారికి చిత్తశుద్ధి లేదని అర్దమవుతోంది.