Kiran jumar Reddy Andhra Pradesh Politicsవర్తమాన రాజకీయాలకు దూరంగా తన జీవనశైలి సాగిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై గత నెల రోజులుగా ఏదొక వార్త మీడియా వర్గాల్లో హల్చల్ చేస్తూనే ఉంటోంది. రాజకీయాల నుండి విరామం తీసుకున్న కిరణ్, త్వరలో కాషాయ జెండా పట్టుకుంటారని గత రెండేళ్ళుగా పొలిటికల్ వర్గాల్లో బలంగా వినిపించిన టాక్. అయితే ఏపీలో మారుతున్న రాజకీయ వాతావరణంతో కిరణ్ కుమార్ రెడ్డి మనసు మార్చుకున్నారనేది బలంగా వినపడుతున్న మాటలు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన ‘జనసేన’ పార్టీలో సిఎం అభ్యర్ధిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉంటారని, గతంలో ఉన్న పాలనా అనుభవం రీత్యా ఈ దిశగా ఇరువర్గాల మధ్య చర్చలు జరిగాయనేది ఇటీవల వినిపించిన సమాచారం. అయితే ఇందులో నిజానిజాలు బయటకు రాకముందే, మరో వార్త వెలుగులోకి వచ్చింది. కొత్త పార్టీలో చేరి మళ్ళీ తన ఉనికిని చూపించుకోవడానికి ప్రయత్నించడం కంటే, గతంలో పెనవేసుకుపోయిన కాంగ్రెస్ పార్టీతోనే అనుబంధం కొనసాగించడం మేలనుకున్నారని లేటెస్ట్ గా హల్చల్ చేస్తున్న న్యూస్.

అయితే ఇందులో వాస్తవం ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదు. ఏపీలో కాంగ్రెస్ పుంజుకునే పరిస్థితి ఇప్పట్లోనే కాదు, ఎప్పటికీ లేదన్నది దాదాపుగా ఖరారైన అంశం. మరి అలాంటి టైటానిక్ షిప్ లో కిరణ్ ఎక్కుతారనేది పుకారుగానే భావించవచ్చు. అలాగని పవన్ పక్కన చేరాలన్న ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే పరిస్థితి. నిలకడలేని స్వభావం పవన్ సొంతం. రాజకీయాలలో ఇది అస్సలు పనికి రాదు. మరి పవన్ పక్కన చేరి మరొక ప్రయోగం చేస్తారా లేదా అన్నది ఆసక్తికరమైన అంశంగా మారింది.

విశేషం ఏమిటంటే… మునిగిపోయిన టైటానిక్ లాంటి కాంగ్రెస్ పేరు వినపడుతోంది… అలాగే భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియని పవన్ జనసేన పేరు వినపడుతోంది గానీ… ఏపీలో ప్రతిపక్ష పార్టీ మరియు టిడిపికి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి జగన్ వైసీపీ పేరు మాత్రం అస్సలు వినిపించకపోవడం విశేషం. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైనప్పటికీ, కిరణ్ కుమార్ రెడ్డి వైసీపీ వైపుకు చూస్తున్నారనేది మాత్రం ఇప్పటివరకు తెరపైకి రాని విషయం. బహుశా జగన్ ను అతి దగ్గరగా చూసిన వ్యక్తులలో కిరణ్ కుమార్ రెడ్డి ఒకరు గనుక అటు వైపుగా వెళ్ళరు అనే దానిపై స్పష్టత ఉందేమో గానీ, జగన్ పేరు మాత్రం బయటకు రావడం లేదు.