Kinjarapu-Atchannaiduఆంధ్రప్రదేశ్‌లో దయనీయంగా మారిన రోడ్ల పరిస్థితిపై మీడియాలో హైలైట్ అవుతుండటంతో శుక్రవారంలోగా రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లన్నిటికీ మరమత్తులు పూర్తి చేసి నాడు-నేడు ఫోటోలు పెట్టాలని సిఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.

వాటిపై ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఈరోజు ట్విట్టర్‌లో వివిద జిల్లాలలో రోడ్ల దుస్థితిని కళ్ళకు కట్టినట్లు చూపుతున్న ఫోటోలు, న్యూస్ పేపర్ క్లిప్పింగులు పోస్ట్ చేశారు.

“ముఖ్యమంత్రిగారు రేపు అనగా జూలై 15వ తేదీకల్లా రాష్ట్రంలో రోడ్లపై గుంతలు ఉండవు అని మీరు హామీ ఇచ్చినట్లు పత్రికలలో వార్తలు వచ్చాయి. కానీ మూడేళ్ళుగా ‘అద్దాలా మారనున్న రోడ్లు’ వంటి కధనాలతో మీ సాక్షి పత్రిక మీ అసమర్దతను బాగానే కప్పిపుచ్చుతోంది.

రేపటిలోగా రాష్ట్రంలో రోడ్లన్నీ బాగు చేయించడం మీ ప్రభుత్వం వల్ల కాని పని. అందుకే అన్నీ వద్దు. కనీసం నేడు పత్రికలలో వచ్చిన ఈ చెత్తరోడ్లకైనా రేపటికల్లా మరమత్తులు చేయించగలరా?అని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఆ చెత్త రోడ్ల ఫోటోలు, వివరాలను మీకోసం ఇక్కడ పెడుతున్నాను. రేపటిలోగా వీటిని బాగుచేయించి ప్రజల ఇబ్బందులు దూరం చేయండి. ఈ ఛాలెంజ్‌ని స్వీకరిస్తారా? చేతులెత్తేస్తారా?” అని అచ్చన్న ట్వీట్ చేశారు.

అచ్చన్న పెట్టిన ఆ రోడ్లను రెండు రోజులలో కాదు కదా రెండు నెలల్లో కూడా మరమత్తులు చేయించడం కష్టం అని ఆ ఫోటోలను చూస్తే అర్దమవుతోంది. వాటిని చూస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రోడ్లన్నీ ఇలాగే ఉన్నాయా?అని ఇతర జిల్లాలు, పొరుగు రాష్ట్రంలో ప్రజలు అనుకొంటున్నారు.

జగన్ ప్రభుత్వం దృష్టి ఎల్లప్పుడూ సంక్షేమ పధకాల అమలు, వాటి కోసం ఎక్కడ నుంచి అప్పులు తేవాలనే దానిపైనే ఉంటుంది తప్ప పాలనపై ఉండదు. కనుకనే రాష్ట్రంలో రోడ్లు ఇంత దయనీయంగా మారాయనే టిడిపి నేతలు వాదనలు నిజమే అనిపించకమానదు ఈ రోడ్ల దుస్థితి చూస్తుంటే. కనీసం మౌలిక సదుపాయమైన రోడ్లను కూడా నిర్మించలేకపోతున్న జగన్ ప్రభుత్వం ఇక పోలవరం, మూడు రాజధానులు ఎప్పటికీ పూర్తి చేస్తుంది? ఎలా పూర్తి చేస్తుంది?