ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపికి తమ అభ్యర్ధిని గెలిపించుకొనేంత సంఖ్యాబలం లేనప్పటికీ, వైసీపీలో చిచ్చు పెట్టేందుకే పోటీ చేస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వారి విమర్శలపై ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజారపు అచ్చన్నాయుడు స్పందిస్తూ, “మా పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలున్నారని, జనసేనకు ఒక ఎమ్మెల్యే ఉన్నారని శాసనసభ రికార్డులలో మీరే పేర్కొంటుంటారు. కానీ ఇప్పుడు మాకు 19 మందే ఉన్నారని మీరే వాదిస్తున్నారు. నలుగురు ఎమ్మెల్యేలు మాకు దూరం అయ్యారు తప్ప పార్టీని వీడిపోలేదు. దూరం అయిన ఎమ్మెల్యేలు తాము తొందరపడ్డామని బాధపడుతున్నారు. వారు మాతోనే ఉన్నారు. ఒక ఎమ్మెల్సీని గెలిపించుకొనేందుకు 22 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా మాకు 23 మంది ఉన్నారు కనుకనే మేము మా అభ్యర్ధి పంచుమర్తి అనురాధను పోటీకి దింపాము. ఈ ఎన్నికలలో ఆమె తప్పకుండా విజయం సాధిస్తారనే నమ్మకం మాకుంది,” అని అన్నారు.
టిడిపికి దూరమైన ఎమ్మెల్యేలలో గంటా శ్రీనివాసరావు కూడా ఒకరు. అయితే ఆయన ఇదివరకు రాజీనామా పత్రాన్ని స్పీకర్‌కు పంపించడంతో ఇప్పుడు ఆయనకు ఓటు హక్కు లేకుండా చేసేందుకు రాజీనామా పత్రాన్ని ఆమోదించబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వాటిపై ఆయన స్పందిస్తూ, “రెండేళ్ళుగా నా రాజీనామాని ఆమోదించమని ఎన్నిసార్లు స్పీకర్‌కు లేఖలు వ్రాసిన స్పందించలేదు. ఇప్పుడు ఈ ఎన్నికల ఓటర్ల జాబితా విడుదల చేసి పోలింగ్ మొదలైన తర్వాత ఆమోదిస్తే సాంకేతికంగా అది చెల్లదు. అలా చేస్తే వైసీపీ పెద్ద తప్పు చేసిన్నట్లే అవుతుంది. మా పార్టీ అభ్యర్ధి పంచుమర్తి అనురాధ నామినేషన్ పత్రాల మీద సంతకం చేసింది నేనే. కనుక నేను తప్పకుండా నా ఓటు హక్కుని వినియిగించుకొంటాను. మా అభ్యర్ధి గెలుపు ఖాయమే,” అని అన్నారు.
వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి తాము ఆత్మ ప్రభోదం ప్రకారమే అంటే టిడిపికి ఓట్లు వేస్తామని ఇదివరకే చెప్పారు. కనుక టిడిపిలో ఉన్న 19 మంది ఎమ్మెల్యేలతో పాటు వీరు ముగ్గురే ఓట్లు వేసినా టిడిపి అభ్యర్ధి గెలవడం ఖాయంగానే కనిపిస్తోంది. వైసీపీలో టికెట్ లభించదని భావిస్తున్న మరో 4-5 ఎమ్మెల్యేలు కూడా తమకే ఓట్లేయవచ్చని టిడిపి నేతలు భావిస్తున్నారు.
ఒకవేళ ఈ ఎన్నికలలో కూడా టిడిపి ఒక్క సీటు గెలుచుకొంటే వైసీపీకి చాలా పెద్ద షాకే అవుతుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. కనుక టిడిపి పోటీ చేసిన ఒక్క సీటుపై అంతవరకు సస్పెన్స్ తప్పదు.