Kinjarapu_Atchannaidu_Jagan_Maha_Sivarathri_Posterమహాశివరాత్రి సందర్భంగా మొన్న వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో వివాదస్పదమైంది. దానిలో సిఎం జగన్మోహన్ రెడ్డి ఆలయం వెలుపల ఆకలితో ఉన్న బాలశివుడి నోట్లో పాలుపోస్తున్నట్లు చూపారు. వెనుక ఆలయం మెట్లపై నుండి శివలింగానికి అభిషేకం చేసిన పాలు వృధాగా కారిపోతున్నట్లు చూపారు. అంటే శివలింగానికి పాలాభిషేకం వృధా చేయడమేనని, ఆకలిగా ఉన్నవారికి ఆ పాలు వినియోగిస్తే మంచిదన్నట్లు ఆ బొమ్మలో సూచిస్తున్నట్లు అర్దమవుతోంది.
అభిషేకప్రియుడైన శివుడికి శివరాత్రినాడు నీళ్ళు, పాలు, పెరుగు, తేనె, అన్నం, ఆకులు, పూవులు, విభూతి వంటి రకరకాల పదార్ధాలతో అభిషేకాలు జరుగుతుంటాయి. కాలకూట విషాన్ని గొంతులో నిలుపుకొని లోకాలని కాపాడుతున్న పరమశివుడికి హిందువులు అభిషేకాలు చేయడానికి ప్రధాన కారణం ఇదే. శివరాత్రినాడు అభిషేకాలు చేస్తే సకల పాపాలు హరించుకుపోయి మోక్షం ప్రాప్తిస్తుందని హిందువులు నమ్ముతారు.

శివాభిషేకాల వెనుక ఉన్న ఈ పరమార్ధం తెలియని వైసీపీ సోషల్ మీడియా విభాగం పాలతో శివాభిషేకం చేయడం సరికాదన్నట్లు చూపడంపై దీనిపై ఏపీ బిజెపి నేతలు తీవ్ర అభ్యంతరం వ్హక్తం చేస్తున్నారు. సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రచారయావతో హిందూ దేవతలని కించపరిచేవిదంగా, హిందువుల మనోభావాలని దెబ్బతీసేవిదంగా ఇటువంటి చిత్రాలు పోస్ట్ చేయించడం సరికాదని, తక్షణం వాటిని తొలగించి హిందువులకి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు.
అయితే వైసీపీ సోషల్ మీడియా విభాగం ఏమాత్రం తగ్గకుండా, ఈసారి ఆ చిత్రంతో పాటు మరో చిత్రం కూడా జోడించి వేశారు. దానిలో ఆలయంలో భక్తులు శివలింగాన్ని నీటితో అభిషేకాలు చేస్తుంటే, ఆలయం వెలుపల దాహంతో ఉన్న ఓ జంతువుకి పరమశివుడు తన కమండలంలో నుంచి నీళ్ళు త్రాగిస్తున్నట్లు బొమ్మవేసి, “ఈ ప్రపంచంలో అణువణువునా ఆ పరమశివుడు కొలువై ఉంటాడు. అన్నార్తుల ఆకలి తీర్చదమే ఈశ్వరారాధన… ఇందులో శివుడిని అవమానించడం ఎక్కడ జరిగిందో ఆ పరమాత్ముడికే ఎరుక,” అంటూ జవాబిచ్చారు.

ఈసారి ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజారపు అచ్చన్నాయుడు వారికి ట్విట్టర్‌లోనే ఘాటుగా సరైన జవాబు ఇచ్చారు. “నిన్నటి నుండీ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా పెయిడ్ కార్టూన్లు వేయించుకున్న జగన్ రెడ్డి Narcissistic personality disorder (NPD) తో బాధ పడుతున్నాడు. గాడ్ కాంప్లెక్స్ తో బాధ పడే వ్యక్తులు తాము ఎన్నడూ ఏ పొరపాటు గానీ, తప్పు గానీ చేయం అన్న భ్రమల్లో బ్రతుకుతారు. సాక్షాత్తూ పరమేశ్వరుడికే తాను ఆకలి తీరుస్తున్నట్లు భావిస్తున్న జగన్ కు పూర్తిగా మతి భ్రమించింది. ఘోరమైన తప్పు చేయడమే గాక, కనీసం పశ్చాత్తాపం కూడా లేకుండా నిస్సిగ్గుగా సమర్ధించుకుంటున్నాడు అంటే ఇంతకన్నా బరితెగింపు ఏముంటుంది? జగన్ ఇప్పటికైనా తన తప్పును ఒప్పుకుని, హిందువులకు, పరమశివుని భక్తులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను,”అని ట్వీట్‌ చేశారు.

అచ్చన్నాయుడు చెప్పిన ఈ ‘గాడ్ కాంప్లెక్స్’ అంటే తనని తాను దేవుడిగా భావిస్తుండటం, అందరి నెత్తిమీద చెయ్యిపెడుతుండటం అదే సూచిస్తోంది. పరమతసహనం ఉంటే మంచిదే కానీ పరమతం ఆచరించనప్పుడు దానితో ఈవిదంగా పరాచికాలు ఆడటం సరికాదు. హిందూ దేవుళ్ళు, ఆలయాలు, హిందువుల మనోభావాలతో పరాచికాలు ఆడితే చివరికి ఎవరు నష్టపోతారో చరిత్ర చెపుతోంది.