Kinjarapu Atchannaiduరాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టిడిపి నేతలను, కార్యకర్తలను సోషల్ మీడియా ఉచ్చులోకి లాగి పార్టీని దెబ్బతీయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. టిడిపితో సహా అన్ని పార్టీలలోను బాలయ్య, జూ.ఎన్టీఆర్‌, చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, రామ్ చరణ్‌, అల్లు అర్జున్‌, మహేష్ బాబు, ప్రభాస్‌ తదితర హీరోల వీరాభిమానులున్నారు. వారందరూ యువతరం కావడంతో సహజంగానే వారిలో కాస్త ఆవేశం ఎక్కువ కనుక ఇతర హీరోల గురించి టక్కున ఏదో కామెంట్ చేసేస్తుంటారు. దాంతో సోషల్ మీడియాలో యుద్ధం మొదలైపోతుంది. ఈ బలహీనతనే ప్రత్యర్ధి పార్టీ కనిపెట్టి వారిని ఆ ఉచ్చులోకి లాగి రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. కనుక పార్టీ కార్యకర్తలు, పార్టీలో హీరోల అభిమానులు ఈ ఉచ్చులో చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు కోరారు.

పార్టీలో ఎవరూ అనవసరంగా ద్వేషపూరితమైన సందేశాలు పెట్టవద్దని, ముఖ్యంగా ఇతర హీరోల అభిమానుల మనోభావాలను దెబ్బతీసే విదంగా ఎటువంటి సందేశాలు పెట్టవద్దని హితవు పలికారు. టిడిపిలో బాలయ్య, జూ.ఎన్టీఆర్‌ అభిమానులను ఉద్దేశ్యించే ఆయన సున్నితంగా ఇది చెప్పారని అర్దం అవుతోంది. వారికి తమ హీరోలపై వీరాభిమానం ఉంటే తప్పులేదు. కానీ మెగా హీరోలను ద్వేషించవలసిన అవసరం లేదు. అలాగే మెగాభిమానులు కూడా నందమూరి హీరోలను ద్వేషించనవసరం లేదు.

ఆర్ఆర్ఆర్ సినిమాలో మెగా హీరో రామ్ చరణ్‌, నందమూరి హీరో జూ.ఎన్టీఆర్‌ ఇద్దరూ చక్కగా కలిసి పనిచేశారు. వారు అంత స్నేహంగా ఉంటే వారి అభిమానులు మాత్రం పరస్పరం కత్తులు దూసుకొంటున్నారు! ఉదాహరణకు ఆర్ఆర్ఆర్ సినిమాలో జూ.ఎన్టీఆర్‌ పేరు ఆస్కార్ అవార్డుకి వెళ్ళబోతోందనే వార్తపై ఇరువురి అభిమానులు ఏ స్థాయిలో పోరాడుకొన్నారో అందరూ చూశారు. కానీ దాంతో వారు ఏం సాధించాము?అని వారే ఆలోచించుకోవాలి.

మళ్ళీ ఇప్పుడు చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్‌’ రిలీజ్ అయినప్పుడు కూడా మెగా-నందమూరి మద్య సోషల్ మీడియాలో యుద్ధం మొదలైంది. రేపు నందమూరి సినిమా రిలీజ్ అయినప్పుడు ఇదే జరుగుతుంది. దీని వలన వారి అభిమాన హీరోల సినిమాలకే కాకుండా వారి పార్టీలకు కూడా చాలా నష్టం కలుగుతోందనే విషయం యువ అభిమానులు పట్టించుకోవడం లేదు.

ఒక సినిమాని నిర్మించడం ఎంతో ఖర్చు, శ్రమతో కూడుకొన్న వ్యవహారం. అలాగే ఓ రాజకీయపార్టీ నిర్వహణ ఇంకా క్లిష్టమైనది. కనుక టిడిపి పోరాటం ప్రభుత్వ వైఫల్యాల మీదే కానీ ఏ హీరోల మీద కాదనే విషయం పార్టీలో యువ అభిమానులు తప్పక గమనించాలి. వారు ఆవేశంతో చేసే విమర్శల వలన వారు స్వయంగా ఇబ్బందులలో చిక్కుకోవడమే కాకుండా, టిడిపిని దెబ్బ తీయడానికి ప్రత్యర్ధి పార్టీకి ఆయుధాలు అందిస్తున్నామని మరిచిపోకూడదు. కనుక పార్టీ శ్రేయస్సు, తమ అభిమాన హీరోల శ్రేయస్సు కోరుకొంటున్నట్లయితే ఇటువంటి విద్వేషాలకు దూరంగా ఉండాలని అచ్చెన్న హితవు చెప్పారు. మరి టిడిపిలో హీరోల వీరాభిమానులు, పార్టీ కార్యకర్తలు అచ్చెన్న చెపుతున్న ఈ మంచిమాటలని వింటారా?