Virat Kohli IPLఆడిన తొలి మ్యాచ్ లలో ఎక్కువ శాతం ఓటమి చెంది, ప్లే ఆఫ్స్ రేస్ లో వెనుకబడ్డ కోహ్లి సేన ప్రస్తుతం మాత్రం మాంచి దూకుడుగా ఆడుతోంది. ఆడుతున్న ప్రతి మ్యాచ్ లోనూ తప్పక గెలవాల్సి ఉండడంతో, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు ప్రతి మ్యాచ్ ‘డూ ఆర్ డై’ లాంటిది. అయితే గత రెండు మ్యాచ్ ల నుండి బెంగుళూరు జట్టు ఆట తీరు చూసిన వారు మాత్రం, ముందు మ్యాచ్ లను ఓడిన జట్టు ఇదేనా అవాక్కవ్వడం సహజమే.

కింగ్స్ ఎలెవన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేపట్టి 67 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న బెంగుళూరు జట్టును డివిలియర్స్ 35 బంతుల్లో 64 పరుగులు చేసి ఆదుకున్నాడు. దీంతో 175 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ ను నమోదు చేయగలిగింది. ఆ తర్వాత లక్ష్యాన్ని చేపట్టిన పంజాబ్ జట్టు కెప్టెన్ మురళీ విజయ్ 57 బంతుల్లో 89 పరుగులు చేసి మ్యాచ్ ను విజయపు అంచుల దాకా తీసుకువెళ్లారు.

అయితే కీలక దశలో మురళీ విజయ్ అవుట్ కావడంతో మ్యాచ్ రసకందాయంలో పడింది. స్తోనిస్ 22 బంతుల్లో 34 పరుగులు చేసినప్పటికీ, లక్ష్య చేధనకు ఒక్క పరుగు దూరంలో బోల్తా పడింది పంజాబ్. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ వీక్షకులకు మాంచి కిక్ ను పంచింది. 4 ఓవర్లు వేసి కేవలం 22 పరుగులు మాత్రమే ఇవ్వడం కాక, 2 కీలక వికెట్లు తీసిన షేన్ వాట్సన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

ఈ విజయంతో 9 మ్యాచ్ లలో 8 పాయింట్స్ సొంతం చేసుకున్న బెంగుళూరు జట్టుకు బుధవారం నాడు ముంబై ఇండియన్స్ తో జరగబోయే మ్యాచ్ కీలకం కానుంది. అటు పక్క ముంబైకు కూడా ఆడిన ప్రతి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి నెలకొనడంతో… ఈ సీజన్ ఐపీఎల్ కే హైలైట్ మ్యాచ్ అవుతుందని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇరు జట్లకు ‘డూ ఆర్ డై’ కావడంతో, ఈ మ్యాచ్ తర్వాత టాప్ 4 స్థానాలు దాదాపుగా ఖరారవుతాయని విశ్లేషణలు చేస్తున్నారు.