Kidari Sravan Kumar resignationఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ తన పదవికి రాజీనామా చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు. మంత్రిగా నియమితులై ఆరు నెలలవుతున్నా ఇప్పటికీ చట్టసభల్లో సభ్యుడు కాకపోవడమే దీనికి కారణం. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు గతేడాది మావోయిస్టుల చేతిలో హతమైన అనంతరం ఆయన కుమారుడు శ్రావణ్‌కుమార్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అయితే అప్పటికి ఆయన ఏ సభలోనూ సభ్యుడు కాదు.

2018 నవంబరు 11న గవర్నర్‌ నరసింహన్‌ ఆయనతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అంటే ఈ నెల పదో తేదీకి ఆయన పదవి చేపట్టి ఆరు నెలలు నిండుతుంది. ఈ లోగా ఆయన శాసనసభకు గానీ మండలికి గానీ ఎన్నిక కావాలి. ఆ లోగా రెండిటికి అవకాశం లేకపోవడంతో ఆయనకు రాజ్ భవన్ నుండి ఆ మేరకు వర్తమానం అందినట్టు సమాచారం. దీంతో ఆయన రాజీనామా అనివార్యమైంది. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఆయన సూచన మేరకు నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

ఒకవేళ ఆయన రాజీనామా చెయ్యకపోతే గవర్నర్ తొలగించే అవకాశం ఉంది. దీనితో ఆయన రాజీనామా చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. శ్రావణ్ తన తండ్రి స్థానం నుండి పోటీ చేశారు. ఆయన ఎన్నికై తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే మళ్ళీ మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ఈ నెల 23న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వస్తాయి. గత ఎన్నికలలో ఏజెన్సీ ప్రాంతాలలో టీడీపీ పేలవమైన ప్రదర్శన ఇచ్చింది. అయితే ఈ సారి మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఆ పార్టీ ధీమాగా ఉంది. తండ్రి మరణం వల్ల వచ్చే సానుభూతి కూడా శ్రావణ్ కు సాయపడొచ్చు.