Khiladi movie public talkవరుస ప్లాప్ లతో సతమవుతోన్న మాస్ మహారాజా రవితేజకు గతేడాది “క్రాక్” సినిమా ఎంతో రిలీఫ్ ను పంచింది. టాలీవుడ్ కు కూడా ఊపునిచ్చిన ‘క్రాక్’ సినిమాతో రవితేజ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేసారు. దీంతో నేడు రిలీజ్ అయిన “ఖిలాడి” సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టే ఇటీవల విడుదలైన ధియేటిరికల్ ట్రైలర్ కూడా అభిమానుల్లో ఆశలు నింపింది.

మరి ఆ అంచనాలను “ఖిలాడి” అందుకుందా? అంటే… అలాంటి దానికి ఏ మాత్రం ఆస్కారం లేకుండా సినిమాను తెరకెక్కించారనే టాక్ సోషల్ మీడియా వ్యాప్తంగా విస్తరించింది. ‘రాక్షసుడు’ సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకున్న రమేష్ వర్మ, ‘ఖిలాడి’ సినిమాను ప్రేక్షక రంజకంగా తెరకెక్కించడంలో విఫలమయ్యారని ఘంటాపథంగా చెప్తున్నారు.

రవితేజ రొటీన్ యాక్షన్ డ్రామా తెరపై పండించగా, హీరోయిన్లు డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు స్కిన్ షోకే పరిమితమయ్యారు. ప్రెస్ మీట్ లోనే హాట్ హాట్ కాస్ట్యూమ్స్ తో టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయిన హీరోయిన్ డింపుల్, తెరపై కూడా అదే పంథాలో కనిపించింది. సీబీఐ ఆఫీసర్ గా నటించిన యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఈ సినిమాకు ఏ మాత్రం దోహద పడలేకపోయారు.

2005లో ‘ఒక ఊరిలో’ సినిమా నుండి కెరీర్ ప్రారంభించిన దర్శకుడు రమేష్ వర్మ, ఆ తర్వాత ‘రైడ్, వీర, అబ్బాయితో అమ్మాయి’ వంటి వరుస వైఫల్యాలను చవిచూసి, ‘రాక్షసుడు’ సినిమాతో కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకున్నాడు. ‘వీర’ సినిమాతో రవితేజకు ఇప్పటికే ఒకసారి చేదు అనుభవాన్ని మిగిల్చిన రమేష్ వర్మ, ‘ఖిలాడి’తో కూడా అదే అనుభవాన్ని పంచే విధంగా ఉండడం విశేషం.