Khaidi No 150 Trailer Talkమెగా అభిమానులంతా ఎదురుచూసిన చిరంజీవి రీ ఎంట్రీ మూవీ “ఖైదీ నంబర్ 150” సినిమా ట్రైలర్ విడుదలై, యూ ట్యూబ్ మళ్ళీ మోత మోగుతోంది. దాదాపు పదేళ్ళ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై మెగాస్టార్ కనపడుతుండడంతో ఈ మాత్రం హంగామా ఉండడం సహజమే గానీ, అసలింతకీ ట్రైలర్ ఎలా ఉంది? అంటే అభిమాన హీరో ఏం చేసినా ఫ్యాన్స్ కు నచ్చుతుంది, అలా నచ్చుతుంది కాబట్టే వాళ్ళు అభిమానులవుతారు. కానీ, సాధారణ సినీ ప్రేక్షకుడు మాత్రం ఈ ట్రైలర్ పట్ల మిక్కిలి అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు.

చిరంజీవి నటన అంటేనే సహజత్వంతో నిండుకుని ఉంటుంది. ఎలాంటి పాత్రలనైనా అంత సహజంతో చేయడం వలనే సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదిగారు. కానీ, ‘ఖైదీ నంబర్ 150’ ట్రైలర్ లో మెగాస్టార్ చూపించిన హావభావాలు, పలికిన డైలాగ్స్ సహజత్వానికి దూరంగా ఉండడం విశేషం. ఇక, ప్రస్తుతం సినిమా విజయాలలో కీలక పాత్ర పోషించే డైలాగ్స్ అయితే ‘అవుట్ డేటెడ్’ అన్న విషయం ఫ్యాన్స్ సైతం అంగీకరించే విషయమే. ప్రస్తుత రోజుల్లో త్రివిక్రమ్ మాదిరి క్లాస్ పంచ్ లు గానీ, పూరీ మాదిరి మాస్ పంచ్ లకు మాత్రమే ప్రేక్షకులు పట్టం కడుతున్నారు.

మరి ఇలాంటి రోజుల్లో ఎప్పుడో 70, 80 దశకాల్లో వినిపించే ‘పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది’ లాంటి ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తాయో చూడాలి. నిజానికి ఆ రోజుల్లో ఇలాంటి డైలాగ్స్ కు అభిమానులు చొక్కాలు చించేసుకునే విధంగా స్పందించేవారు. కానీ, ప్రస్తుత పరిస్థితి వేరు. ఇలాంటి డైలాగ్స్ వింటుంటే… అవి కామెడీగా మారిపోతున్నాయి. అందుకు ‘ఖైదీ నంబర్ 150’ డైలాగ్స్ ఏమి భిన్నం కాదు. చిరు పవర్ ఫుల్ గా చెప్పిన ఆ డైలాగ్ ను చూస్తుంటే, వీక్షకులకు నవ్వు రావడం సహజమే.

తన సినిమాకు సంబంధించిన అన్ని విషయాలలో చాలా కేర్ తీసుకునే చిరంజీవి, డైలాగ్స్ విషయంలో ‘అవుట్ డేటెడ్ అయిన పరుచూరి బ్రదర్స్ ను ఎంపిక చేసి పప్పులో కాలేసారా? ట్రైలర్ అయితే అలాంటి సంకేతాలే ఇచ్చింది గానీ, ఫుల్ రిజల్ట్ తెలియాలంటే సిల్వర్ స్క్రీన్ పై ప్రేక్షకుల నుండి వచ్చే స్పందన వరకు వేచిచూడాల్సిందే.