khaidi-no-150-collections-by-trs-ministerభారీ హంగులతో సిద్ధమవుతున్న మెగాస్టార్ చిరంజీవి “ఖైదీ నంబర్ 150” సినిమా విడుదల సమయానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక వరాన్ని కానుకగా ఇవ్వబోతోందా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తెలంగాణా రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన తాజా వ్యాఖ్యలే ఇందుకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని సినీ, పొలిటికల్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. త్వరలోనే రోజులు 5షోలను ప్రదర్శించేందుకు రాష్ట్రంలో అనుమతులు ఇవ్వబోతున్నామని తలసాని చేసిన ప్రకటన “ఖైదీ నంబర్ 150”కి వరంగా మారబోతుందనేది ఈ సారాంశం.

నిజానికి ఈ ప్రతిపాదన ఎప్పటినుండో వ్యక్తమవుతున్నప్పటికీ, అది కార్యరూపం దాల్చుకోవట్లేదు. చిన్న సినిమాలకు ధియేటర్లు దొరకడం లేదన్న కారణంతో రోజులో ఒక షోను ఖచ్చితంగా చిన్న సినిమాలకు కేటాయించాలనే విధంగా ఈ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అయితే అమలులోకి వచ్చేసరికి ఎంతవరకు ఈ ప్రణాళికలు సిద్ధమవుతాయో గానీ, 5షోలకు అయితే త్వరలోనే గ్రీన్ సిగ్నల్ రానుంది. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న “ధృవ” సినిమా తర్వాత విడుదల కాబోయే పెద్ద సినిమాగా మెగాస్టార్ “ఖైదీ నంబర్ 150” సంక్రాంతి బరిలో నిలిచిన సంగతులు తెలిసినవే.

దీంతో ఈ లోపున అయిదు షోల ప్రదర్శనలకు అనుమతులు లభించవచ్చని, దీని ద్వారా లబ్ధి పొందే తొలి చిత్రం “ఖైదీ నంబర్ 150”యే అవుతుందని ట్రేడ్ వర్గాల టాక్. దశాబ్ద కాలం తర్వాత రీ ఎంట్రీ ఇస్తుండడంతో మాములుగానే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దీంతో అదిరిపోయే ఓపెనింగ్స్ మెగాస్టార్ వశం అవుతాయని అంతా భావిస్తున్నారు. దీనికి తోడు తెలంగాణా వ్యాప్తంగా ప్రతి ధియేటర్ లో ఒక షో పెరిగితే… అది మెగా సునామీకి శ్రీకారం చుట్టినట్లే అవుతుందని మెగా ఫ్యాన్స్ ఇప్పటినుండే ఉత్సాహంలో మునిగితేలుతున్నారు.