Khaidi-No.150 Audio Launch at KLU grounds vijayawadaవిజయవాడ వేదికగా మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ “ఖైదీ నంబర్ 150” ఆడియోను విడుదల చేద్దామని భావించిన చిత్ర యూనిట్ కు చుక్కెదురైంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంను కేటాయించాలని కోరుతూ చిత్ర నిర్మాత రామ్ చరణ్ రాసిన లేఖకు అనుమతులు లభించలేదని సమాచారం. విజయవాడ నగరం నడిబొడ్డున గల ఇందిరాగాంధీ స్టేడియంలో ఆటలకు సంబంధించిన కార్యకలాపాలు తప్ప, మరే ఇతర కార్యక్రమాలు నిర్వహించరాదనే హైకోర్ట్ ఆదేశాల రీత్యా అనుమతులు ఇవ్వకపోవడంతో, ప్రత్యామ్నాయ ప్రదేశాల కోసం అల్లు అరవింద్ రంగంలోకి దిగారు.

ఇటీవల వర్మ “వంగవీటి” ఆడియో విడుదల చేసిన కేఎల్ యూనివర్సిటీ మైదానాన్ని అల్లు అరవింద్ ఆడియో నిర్వహణ కోసం పరీక్షించారు. దాదాపుగా ఇక్కడే ఆడియో వేడుక జరగనుందని తెలుస్తోంది. ‘వంగవీటి’ ఆడియో వేడుకకు కూడా జనం విపరీతంగా తరలిరావడంతో, మెగాస్టార్ అభిమానగణానికి కూడా ఈ మైదానం సరిపోతుందని భావించిన అల్లు అరవింద్ దీనికి ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. విజయవాడ నుండి దాదాపుగా 15-20 నిముషాల ప్రయాణమే కావడంతో పెద్దగా భారం కాకపోవచ్చు.

ఆడియో వెన్యూలో మార్పు వచ్చినట్లే, ఆడియో తేదీలో కూడా మార్పు వచ్చే సంకేతాలు కనపడుతున్నాయి. విజయవాడలో అయితే 25వ తేదీన ఆడియో వేడుక నిర్వహణ కోసం చెర్రీ వినతిపత్రం దాఖలు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆ తేదీ 30వ తేదీకి మారవచ్చన్న టాక్ వినపడుతోంది. ఆడియో విడుదలకు, సినిమా విడుదలకు పెద్దగా గ్యాప్ లేకపోవడం వలన, హైప్ అలాగే కొనసాగుతుందనే ప్రణాళికతో ఆడియోను కాస్త లేటుగా విడుదల చేయాలని భావిస్తున్నారట. అయితే వెన్యూ, డేట్ లపై అధికారిక సమాచారం కోసం మెగా ఫ్యాన్స్ నిరీక్షిస్తున్నారు.