kgf2 movie mixed talkరిలీజ్ కు ముందు ఏర్పడిన అంచనాలను అందుకోవడం అన్ని సినిమాలకు, అందరి హీరోలకు, అందరి దర్శకులకు సాధ్యమయ్యే విషయం కాదు. మరి “కేజీఎఫ్” పార్ట్ 1 క్రేజ్ తో ఏర్పడిన భారీ అంచనాలను “కేజీఎఫ్” పార్ట్ 2, అందుకుందా? అంటే… తొలుత వెలువడిన టాక్ ప్రకారం అయితే భిన్న స్పందనలు లభించాయి.

“కేజీఎఫ్ 2″లో హీరోయిజం పాళ్ళు, ఎలివేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. పార్ట్ 1లో దర్శకుడు ప్రశాంత్ నీల్ చూపించిన హీరోయిజాన్ని మించి ఉన్నాయి, కానీ బలమైన విలనిజం లేని కారణంగా కొన్ని సీన్స్ లో ఇది కాస్త ఓవర్ గా అనిపిస్తుంది. అయినప్పటికీ ఎలివేషన్స్ విషయంలో ఇటీవల కాలంలో ఏ హీరోకు లేనంత మాస్ హీరోయిజాన్ని యష్ ద్వారా ప్రశాంత్ నీల్ చూపించారు.

అలాగే పార్ట్ 1లో ఎంత హీరోయిజం ఉన్నప్పటికీ, సెంటిమెంట్ మరియు ఏమోషన్స్ అద్భుతంగా పండించారు. ఇది రెండవ భాగంలో కొంతవరకు లోపించిందనేది విశ్లేషకుల మాట. అయితే ఎన్ని మైనస్ లు ఉన్నప్పటికీ, సినిమాకు నెగటివ్ టాక్ రాకపోవడం మాత్రం చెప్పుకోదగ్గ పరిణామం. ఆ మాటకొస్తే “కేజీఎఫ్” పార్ట్ 1 విడుదలైనప్పుడు పరిస్థితి కూడా ఇదే!

ఆ సమయంలో కూడా రివ్యూలు యావరేజ్ రూపంలోనే వచ్చాయి. కానీ ధియేటర్ లో సినిమాను చూసిన వారు, ఆ తర్వాత ఓటీటీలో వీక్షించిన వారు “కేజీఎఫ్”కు ఫిదా అయిపోయారు. వాటితో ఏర్పడిన భారీ అంచనాలే ఈనాటి ఈ “కేజీఎఫ్” ఓపెనింగ్స్ కు పునాది. ఈ వీకెండ్ వరకు బాక్సాఫీస్ వద్ద “కేజీఎఫ్” తన సత్తా చాటుతుందని చెప్పడంలో సందేహం లేదు.

ఇక మాస్ హీరోగా యష్ క్రేజ్ రెండింతలు అయ్యే విధంగా ఈ సినిమా ఉంది. పోలీస్ స్టేషన్ సీన్ పట్ల సోషల్ మీడియాలో ఇస్తోన్న ఎలివేషన్స్ మాములుగా లేవు. ఇలాంటి సన్నివేశాలను ధియేటర్లో మిస్ అవ్వొద్దు అనేటంత బలంగా కొన్ని సీన్స్ ఉన్నాయనేది వీక్షకుల మాట. రవి బసూర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హీరోయిజాన్ని పీక్స్ కు తీసుకువెళ్ళింది. అలాగే భువన్ గౌడ ఫొటోగ్రఫీ కూడా వెండితెరపై అదిరిపోయింది.

ఈ సినిమా చూసిన తర్వాత ప్రశాంత్ నీల్ తో తర్వాత చేయబోయే ప్రభాస్ సినిమాను ఊహించుకుని పండగ చేసుకోవడం ‘డార్లింగ్’ ఫ్యాన్స్ వంతయితే, మాస్ కు కేరాఫ్ అడ్రస్ అయిన జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా ఎప్పుడు మొదలవుతుందా? అని నిరీక్షించడం తారక్ ఫ్యాన్స్ వంతవుతుంది. మొత్తంగా టాలీవుడ్ లో ప్రశాంత్ నీల్ పేరు కొన్నాళ్ల పాటు వినిపిస్తూనే ఉంటుంది.