KGF Chapter 2కరోనా మహమ్మారిని ఎదురుకొని తమ షూటింగులను తిరిగి ప్రారంభించడంలో కన్నడ చిత్ర పరిశ్రమ ఇతర పరిశ్రమల కంటే చాలా ముందున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని సినిమాలు వారి షూట్ తిరిగి ప్రారంభించడానికి హైదరాబాద్ కు రావడాన్ని మనం చూశాము తాజాగా కెజిఎఫ్ 2 కూడా ఈ జాబితాలో చేరుతుందని అంటున్నారు.

చిత్ర నిర్మాతలు తమ చివరి షెడ్యూల్‌ను ఆగస్టు 15 తర్వాత ప్రారంభించాలని యోచిస్తున్నారు. సినిమా నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కొంత భాగాన్ని షూట్ చేయాలి. పదిహేను రోజుల పని మాత్రమే పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతానికి, వారు సంక్రాంతి 2021 విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

కెజిఎఫ్ 2 పాన్-ఇండియా చిత్రం మరియు చిత్ర నిర్మాతలు తమ సినిమాను అన్ని భాషలలో సోలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. సంక్రాంతికి విడుదల చేస్తే ఆ అవకాశం ఉండదు. ముఖ్యంగా తెలుగు బాక్సాఫీస్ వద్ద చాలా చిత్రాలతో పోటీ పడాల్సి ఉంటుంది. అయితే, ఇవన్నీ ఆ సమయానికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్ లతో ఈ సీక్వెల్ పెద్ద ఎత్తున తయారవుతోంది. ఈ చిత్రం దసరా కోసం విడుదల కావాల్సి ఉంది కాని కరోనా బ్రేక్ కారణంగా ఇది వాయిదా పడింది. మొదటి పార్టు సక్సెస్ తరువాత ఈ సినిమా మీద భారీగా అంచనాలు ఉన్నాయి.