KGF 2 Breaks to RRRగడిచిన రెండు వారాలకు పైగా ఇండియన్ బాక్సాఫీస్ తో పాటు ఓవర్సీస్ ను కూడా ఏలుతూ 1000 కోట్లకు పైగా వసూళ్లతో సంచలనమైన విజయాన్ని సాధించిన “ఆర్ఆర్ఆర్” దూకుడుకు బ్రేకులు పడ్డాయి. భారీ అంచనాల నడుమ నేడు విడుదలైన “కేజీఎఫ్” పార్ట్ 2 ప్రేక్షకులను ఫిదా చేయడంతో, బాక్సాఫీస్ షేక్ అవుతోంది.

“ఆర్ఆర్ఆర్” మాదిరే “కేజీఎఫ్” కూడా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో, ఓపెనింగ్స్ విషయంలో సరికొత్త రికార్డులను సృష్టించనుంది. బాలీవుడ్ అడ్వాన్స్ బుకింగ్స్ లో ఇప్పటికే “బాహుబలి 2” సినిమాను దాటుకుని, నెంబర్ 1 స్థానంలో నిలిచిన “కేజీఎఫ్” పార్ట్ 2 అల్ టైం ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డులో టాప్ 3లో చోటు దక్కించుకోవడం ఖాయంగా కనపడుతోంది.

మిగిలిన అన్ని ఏరియాలలోనూ సూపర్ టాక్ తో దూసుకుపోతున్న “కేజీఎఫ్” పార్ట్ 2 డబ్బింగ్ బొమ్మలలో భారీ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే సినిమాగా నిలవనుంది. అటు యుఎస్ ప్రీమియర్స్ లోనూ 1 మిలియన్ డాలర్స్ పైగా సాధించి, భారీ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. చూడబోతుంటే భారీ విజయం “కేజీఎఫ్ 2” సొంతమయ్యేలా కనపడుతోంది.

“బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్” దక్షిణాది సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుండడం శుభపరిణామం అయితే, రాంగోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఇందులో ‘పెట్రోల్’ పోసి బాలీవుడ్ వర్గాలకు మంటెక్కించేలా ట్వీట్లు చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ లో టాప్ 2 సినిమాలు దక్షిణాది హిందీ డబ్బింగ్ సినిమాలా? దీనిపై బాలీవుడ్ ఏమనుకుంటోంది? అంటూ ప్రశ్నించారు.

టాప్ 2 సినిమాల తర్వాత మిగిలిన స్థానాలలో ఉన్న “వార్, థగ్స్ ఆఫ్ హిందూస్తాన్, టైగర్ జిందా హై” సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ కు, మొదటి రెండు స్థానాలలో ఉన్న “కేజీఎఫ్ 2, బాహుబలి 2″కు మధ్య వ్యత్యాసం చాలా ఉండడంతో స్పష్టంగా దక్షిణాది సినిమాల హవా కొనసాగుతుందని అర్ధమవుతుంది. ఎక్కడ పబ్లిసిటీ స్టంట్ ఉంటే, అక్కడ వర్మ వాలిపోవడం సహజమే కదా!