kevvu-kabadi-program-sri-vani-reddy-kavitha-controversyవదినపై చేయి చేసుకుందన్న వివాదంలో హాట్ హాట్ గా వినపడిన బుల్లితెర నటి శ్రీవాణి పేరు తాజాగా మరోసారి అదే స్థాయిలో హల్చల్ చేస్తోంది. ఒకప్పటి టీడీపీ నేత, సీనియర్ నటీమణి కవితతో శ్రీవాణికి రెమ్యూనరేషన్ విషయంలో వివాదం చెలరేగింది. శ్రీవాణి భర్త విక్రమాదిత్య ‘కెవ్వు కబడ్డి’ అనే షోను నిర్వహిస్తున్నారు. జెమినీ టీవీలో శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో 60 మంది టీవీ నటులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించాలని కవితను కోరారు.

ఇందు నిమిత్తం తనకు రోజుకు 25 వేల వేతనం ఇస్తామన్నారని, దానికి అనుగుణంగానే 75 వేలు ఇచ్చిన శ్రీవాణి, మిగిలిన మొత్తానికి చెక్కు ఇచ్చారని, అయితే దానిని మార్చుకునేందుకు వెళ్లగా ‘స్టాప్ పేమెంట్’ పెట్టారని కవిత చెప్తున్నారు. ఇదే సమయంలో శ్రీవాణి వాదన మరోలా ఉంది. “ఈ షోలో పాల్గొంటున్న వారెవరింటికీ తాను వెళ్లలేదని, కవితపై అభిమానంతో ఆమె ఇంటికి వెళ్లి షోలో పాల్గొనాలని కోరానని, ఆమె దానికి అంగీకరించిందని, దీంతో ఆమె ఫ్రీగా నటిస్తుందని భావించానని, సీనియర్ నటులు చాలా కార్యక్రమాల్లో ఫీగా నటిస్తారని, తాను కూడా అలాగే అనుకున్నానని, కానీ ఆమె రెమ్యూనరేషన్ అడిగారని” చెబుతోంది.

అలాగే ప్రోమో కోసం చీర తీసుకుని వస్తే తాను డబ్బులు ఇస్తానని అన్నారని, తరువాత చీరతో తనకు సంబంధం లేదని చెబుతున్నారని, అలాగే మేకప్ కోసం కూడా ఆమె రోజుకో డిమాండ్ చేశారని శ్రీవాణి ఆరోపణలు చేస్తోంది. అయితే ముందుగా కవిత పారితోషికం మాట్లాడకపోయినట్లయితే, 75 వేల రూపాయలను శ్రీవాణి ఎలా ఇచ్చారు? ఫ్రీగా అనుకుని ఉంటే, ఈ మొత్తం చెల్లించినపుడే అడిగి ఉండాలి కదా? అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం లేకపోవడం విశేషం. దీంతో వీరిద్దరి మధ్య వివాదం ఇంకా సద్దుమణగకపోవడం మరియు విషయం కాస్త మీడియాకు ఎక్కి ‘శ్రీవాణి వర్సెస్ కవిత’ ఎపిసోడ్ రచ్చరచ్చగా మారింది.