Kesineni-Sivanath-Kesineni-Nani-Chandrababu-Naiduటిడిపి విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు కేశినేని చిన్నిల మద్య తలెత్తిన అభిప్రాయబేదాలు పోలీస్ కంప్లైంట్లు చేసుకొనేవరకు వెళ్ళడంతో పార్టీకి, అధినేత చంద్రబాబు నాయుడుకి తలనొప్పిగా మారింది. తనకు కేటాయించిన ఎంపీ స్టిక్కరుకి నకిలీది తయారుచేయించి తన సోదరుడు చిన్ని కారు (నంబర్: టిఎస్ 07 హెచ్‌డబ్ల్యూ 7777) పై అంటించుకొని హైదరాబాద్‌, విజయవాడ, నగరాల్లో తిరుగుతున్నాడని కేశినేని నాని పటమట పోలీసులకు మే 27వ తేదీన ఫిర్యాదు చేశారు.

వారిరువురూ అన్నదమ్ములు, పలుకుబడిన రాజకీయ నాయకులు కావడంతో వారే రాజీపడి తమ సమస్యను పరిష్కరించుకొంటారని పోలీసులు ఎదురుచూశారు. కానీ ఇద్దరూ వెనక్కు తగ్గకపోవడంతో జూన్ 9వ తేదీన పోలీసులు కేశినేని చిన్నిపై కేసు నమోదు చేశారు.

కేశినేని చిన్ని హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇదివరకు ఎన్నికల సమయంలో అన్నకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని వెనకుంటూ అన్ని వ్యవహారాలు చూసుకొనేవారు. అయితే గత కొంతకాలంగా కేశినేని నాని టిడిపి వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం, జిల్లాలోని, విజయవాడ నగరంలో టిడిపి సీనియర్ నేతలతో విభేదిస్తూ అందరినీ దూరం చేసుకోవడం, టిడిపి కార్యక్రమాలకు దూరంగా ఉంటుండటంతో వచ్చే ఎన్నికలలో అన్న స్థానంలో కేశినేని చిన్ని విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేసుకొంటున్నట్లు తెలుస్తోంది. ఇది కేశినేని నానికి ఆగ్రహం కలిగించడం సహజమే. అన్నదమ్ముల మద్య దూరం పెరిగి పోలీస్ కేసులు పెట్టుకొనేవరకు వెళ్ళడంతో జిల్లాలోని, విజయవాడలో టిడిపి నేతలు ఎవరివైపు ఉండాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.

అసలే ఓ పక్క వైసీపీ ప్రభుత్వం, పోలీసుల నుంచి తీవ్ర ఒత్తిళ్ళు ఎదుర్కొంటున్న ఈ సమయంలో సొంత పార్టీలో సొంత అన్నదమ్ములే ఈవిదంగా కీచులాడుకొంటూ రోడ్డున పడటంతో చంద్రబాబు నాయుడు కేశినేని నానిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. వీరి కలహాలతో వైసీపీ నేతలు టిడిపిలో వేలుపెట్టేందుకు అవకాశం కల్పించినట్లవుతుందని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. కనుక కేశినేని సోదరులు కూర్చొని మాట్లాడుకొని సమస్యలను పరిష్కరించుకొంటే మంచిదని సూచిస్తున్నారు.