Kesineni Nani joining tdp rejected TDP parliamentary whipవిజయవాడ ఎంపీగా రెండో సారి ఎన్నికైన కేశినేని నాని ఓటమి అనంతరం తెలుగుదేశం నేతలలో మొట్టమొదట ధిక్కార స్వరం వినిపించిన నేత. అందరూ ఆయన బీజేపీలో చేరడం ఖాయం అనుకున్నారు. అయితే ఆయన గత కొన్ని రోజులుగా తన పంథా మార్చుకున్నారు. ప్రజావేదిక కూల్చివేత నేపధ్యంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ ను టార్గెట్ చెయ్యడం మొదలు పెట్టారు. తాజాగా కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో బీజేపీని కూడా టార్గెట్ చెయ్యడంతో నాని పార్టీ మారే ఆలోచన లేనట్టే అనిపిస్తుంది.

ఇటీవలే టీడీపీలోని నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరినప్పటి ఫోటోను పెట్టి “మీరేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి BJP లోకి వెళుతున్నామని బిల్డప్ ఇచ్చారు. కానీ, నిన్న బడ్జెట్ చూసాక ఈ రాష్ట్ర ప్రజలకు బాగా అర్ధమయ్యింది, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి BJP లోకి చేరారో లేక మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోడానికి BJP లోకి చేరారో అని…,” కేశినేని నాని తన పేస్ బుక్ లో పోస్టు పెట్టారు. దీనితో పాటు కేంద్రం బడ్జెట్ లో పోలవరం, అమరావతి, ఇతర నిధుల ప్రస్తావన లేదని ఆంధ్రప్రదేశ్ కు మరోసారి అన్యాయం జరిగిందని ఆయన పోస్టు చేశారు.

దీనితో కేశినేని నాని పార్టీ వదలరని తెలుగు తమ్ముళ్లు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆయన ఇలాగే పార్టీలో యాక్టీవ్ గా ఉండాలని వారంతా కోరుకుంటున్నారు. 2014లో విజయవాడ నుండి ఎంపీగా తొలిసారి ఎన్నికైన నాని దేశంలోనే బాగా పని చేసిన ఎంపీలలో ఒకరు. వైఎస్సార్ కాంగ్రెస్ గాలిలో కూడా రెండోసారి గెలవగలిగారు. ఆయన నియోజవర్గం కింద వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలలో టీడీపీ ఓడిపోయిన చోట్ల కూడా ఆయనకు దండిగా ఓట్లు రావడం విశేషం.