Kesineni Nani joining tdp rejected TDP parliamentary whipతెలుగుదేశం పార్టీ ఒక పెద్ద పరీక్షను ఎదురుకుంటుంది. దాదాపుగా ఇది జీవన్మరణ సమస్య అని చెప్పుకోవచ్చు. చరిత్రలోనే అతిపెద్ద పరాజయాన్ని ఎదురుకున్న ఆ పార్టీ సమిష్టిగా పని చెయ్యాల్సింది అంతర్గత కుమ్ములాటలతో సతమతం అవుతుంది. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని కినుక వహించారు. కొద్ది రోజుల క్రితం ఆయన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి పార్టీ మారుతున్నారన్న వాదంతులకు తావు ఇచ్చారు. అయితే ఆయన నిన్న చంద్రబాబు నిర్వహించిన రివ్యూ మీటింగుకు హాజరయ్యారు.

అయితే 24 గంటలు గడవకముందే సీన్ మారిపోయింది. చంద్రబాబు ఇచ్చిన పార్లమెంటరీ విప్‌ పదవిని తిరస్కరించారు కేశినేని నాని. తనకు ఆ పదవులు అవసరం లేదని, తనకు అంత పెద్ద పదవులు నిర్వహించే సామర్థ్యం లేదన్నట్లుగా పోస్ట్ పెట్టారు. తన కంటే గొప్ప సామర్థ్యం ఉన్న వారికి.. ఆ పదవులు ఇవ్వాలని అధినేతకు వ్యంగ్యంగా సూచించారు. అయితే బీజేపీలో చేరుతున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన తనకు ఆ అవసరం లేదని చెప్పడం విశేషం.

పార్లమెంటరీ పార్టీ నేత పదవి కోసం కేశినేని నాని ఆశలు పెట్టుకున్నారు. అయితే గత లోక్ సభలో పార్టీ తరపున గట్టిగా గళం విప్పిన గల్లా జయదేవ్‌కు ఆ పదవి అప్పగించారు. లోక్‌సభలో.. పార్టీ నేత పదవిని రామ్మోహన్ నాయుడుకి ఇచ్చారు. దీంతో కేశినేని నాని తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ క్రమంలో ఆయనకు నచ్చజెప్పడానికి గల్లా జయదేవ్ ఆయన వద్దకు వెళ్లారు. ఇటీవలే జరిగిన ఎన్నికలలో టీడీపీ కేవలం మూడంటే మూడే ఎంపీలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికలయ్యి పక్షం రోజులు కూడా కాకముందే టీడీపీలో ముసలం మొదలయ్యింది.