Keshava a blockbuster after hit baahubali 2బాక్సాఫీస్ వద్ద “బాహుబలి 2” ప్రదర్శించిన సునామీ ముందు, సాధారణ కమర్షియల్ సినిమాలు ఎక్కడ నిలబడతాయో అన్న అనుమానాన్ని శర్వానంద్ “రాధ” సినిమా ధృవీకరించింది. ‘యావరేజ్’ టాక్ వచ్చిన ఈ సినిమా వైపుకు ప్రేక్షకులు తల తిప్పకపోవడంతో, ‘బాహుబలి 2’ దెబ్బ ఏంటో సినీ వర్గాలకు అవగతం అయ్యింది. దీంతో ఆ సమయంలో విడుదల చేయాలనుకున్న పలు సినిమాలు కూడా వెనక్కివెళ్ళాయి.

కానీ, కంటెంట్ పై ఉన్న నమ్మకమో, ప్రేక్షకులపై ఉన్న విశ్వాసమో గానీ, నిఖిల్ “కేశవ” సినిమాను ధైర్యం చేసి విడుదల చేసారు. అయితే “రాధ” సినిమా మాదిరి కాకుండా, బాక్సాఫీస్ వద్ద తన హవాను కొనసాగించడంలో నిఖిల్ సక్సెస్ సాధించాడు. వరుసగా వినూత్నమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకుల అభిరుచికి దగ్గరగా వెళ్తున్న హీరో నిఖిల్, “కేశవ” ద్వారా తొలి 10 రోజుల్లో ఏకంగా 18.5 కోట్ల కలెక్షన్స్ సాధించాడు.

దీంతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘బాహుబలి 2’ తర్వాత తొలి హిట్ నమోదైంది. రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ నే డిఫరెంట్ గా ప్రజెంట్ చేసిన దర్శకుడు సుధీర్ వర్మపై కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది. త్రివిక్రమ్, సుకుమార్ వంటి ప్రముఖ దర్శకులు “కేశవ” చిత్రాన్ని అభినందిస్తూ ప్రశంసలు కురిపించారు. ‘కేశవ’ అందించిన ఈ ఊపును, చైతూ “రారండోయ్ వేడుక చూద్దాం” కూడా ఓపెనింగ్స్ రూపంలో కొనసాగించింది గానీ, ఈ సినిమా అసలు పరీక్ష వీక్ డేస్ లో ఎదుర్కోబోతోంది.