Kerala priest says women wearing jeans, T-shirt arouse men,కేరళకు చెందిన క్రైస్తవ మతబోధకుడు, పాస్టర్ సెర్మోన్ మహిళలపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో తాజాగా ఫేస్‌ బుక్‌లో వైరల్ అవుతోంది. పురుషులను రెచ్చగొట్టేలా అమ్మాయిలు దుస్తులు ధరిస్తున్నారని, అందుకే కొన్ని చర్చిల్లో ప్రార్థనలు చేయడం తనకు ఇష్టముండదని పేర్కొన్నారు. అలాంటి చోట్ల అమ్మాయిలు జీన్స్, టీ షర్టులు ధరించి చేతిలో సెల్ పట్టుకుని, జుట్టు కూడా సరిగా దువ్వుకోకుండా వచ్చి ముందు వరుసలో కూర్చుంటారని వ్యాఖ్యానించారు.

ఇది తనకు ఎంతమాత్రమూ నచ్చని విషయమని, అమ్మాయిలు ఇలా ఎందుకు చేస్తారో తనకు ఇప్పటికీ అర్థం కాదని పేర్కొన్నారు. అసలు అలాంటి దుస్తులు ధరించి చర్చికి రావొచ్చా? అంటూ సభకు వచ్చిన అమ్మాయిలను ప్రశ్నించారు. అమ్మాయిల ధరిస్తున్న దుస్తులపై తనకు ఫిర్యాదులు కూడా అందాయని, చర్చ్ ల వద్ద అలాంటి దుస్తులు ధరించి వచ్చిన అమ్మాయిలను చూస్తుంటే తమకు పాపం చుట్టుకుంటుందని తనకు ఫిర్యాదు చేసిన అబ్బాయిలు ఆవేదన వ్యక్తం చేసినట్టు సెర్మోన్ చెప్పుకొచ్చారు.

చాలా మంది మహిళలు పెళ్లి, ఉద్యోగం వంటి సమస్యలపై ఫిర్యాదు చేస్తారని, అయితే దానికి కారణం వారు ధరించే దుస్తులేనని వివరించారు. చుడీదార్లయితే అమ్మాయిలకు చాలా చక్కగా ఉంటాయని, అమ్మాయిల్లో సైతాను ప్రవేశించిందని, అందుకే వారు అటువంటి దుస్తులు ధరిస్తున్నారని పాస్టర్ సెర్మోన్ సదరు వీడియోలో పేర్కొన్నారు. ఇప్పటికే చాలామంది రాజకీయ నేతలు మహిళలు ధరిస్తున్న దుస్తులపై కామెంట్స్ చేసి ఇరుకున పడగా, తాజాగా ఈ పాస్టర్ వంతు వచ్చినట్లుంది.