kejriwal-comments-modiఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పెద్ద నోట్ల రద్దుపై బిజెపి నాయకులను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. పెద్ద నోట్ల రద్దు విషయం బిజెపి నేతలకు ముందుగానే తెలుసని, వారి నల్లధనాన్ని ముందుగానే సర్ధుకున్నారని, దీని వలన పేదవారు మాత్రమే సతమతమవుతున్నారని క్రేజీ కామెంట్స్ చేసారు. దేశంలోనే ఇది ఒక పెద్ద కుంభకోణం అని, బిజెపి ప్రభుత్వం నల్ల కుభేరులను అప్రమత్తం చేసిందని, మోడీ తన సన్నిహిత వ్యాపారస్తులను కాపాడుకున్నారని, బలయ్యింది మాత్రం పేదవాడని పేర్కొన్నారు.

పంజాబ్ కి సంబందించిన బిజెపి నేత ఒకరు 2000 రూపాయల నోట్ల కట్టతో ఫోటో దిగి ట్విట్టర్ పోస్ట్ చేసారని, రోజుకి 4000 రూపాయలే ఒక్కొక్కరికి అందుబాటులో ఉంటే, ఇదెలా సాధ్యమైందో ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని కేజ్రీవాల్ ప్రశ్నించారు. జూలై – సెప్టెంబర్ నెలలలో బెంగుళూరులో బిజెపి కార్యాలయం నుండి బ్యాంకింగ్ లో డిపాజిట్లు అన్ని ఆగిపోయాయని, గుజరాత్ రాష్ట్రంలో వ్యాపారాలు ఇంత పెద్ద ఎత్తున ఎలా సాగుతున్నాయో అర్ధం కావడం లేదని కేజ్రీవాల్ అభిప్రాయ పడ్డారు.

బిజెపి నేతలు మాత్రం… నోట్ల రద్దుని రాజకీయం చేయవద్దని, ఇది దేశానికి మేలు చేసే ఒక సాహశోపేత నిర్ణయం అని, అందరూ దీనికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల సహకారం ఉంది కాని ప్రతిపక్షాల సహకారం కొరవడిందని ప్రభుత్వ పెద్దలు పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ వ్యక్తులలో మార్పు రాకపోయినా వ్యవస్థలో మార్పు రావాలని ప్రతి సామాన్యుడు కోరుకుంటున్నారు.