Keerthy-Suresh-Mahanati-Savitri-biopicతెలుగు లెజెండరీ కధానాయిక “మహానటి” సావిత్రి జీవితగాధ ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. టైటిల్ రోల్ లో ‘నేను శైలజ’ ఫేం కీర్తి సురేష్ అభినయం అందించనుండగా, మరో కీలక పాత్రను సమంత పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా ఆన్ సెట్స్ ఫోటోలు లీకై సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా టైటిల్ రోల్ పోషిస్తున్న కీర్తి సురేష్ లుక్ చూస్తే… అలనాడు మహానటి సావిత్రి ఇలా ఉండేదా అన్న సందేహం కలుగక మానదు.

నిండైన రూపం… పెద్ద బొట్టు… చక్కని చీర కట్టు… ఎలాంటి హావభావాన్ని అయినా అభినయించగల నేరేడు పండ్ల లాంటి కళ్ళు… ఇవి క్లుప్తంగా సావిత్రి భౌతిక రూపం. కానీ ఇక్కడ ఫోటోలో మాత్రం కీర్తి సురేష్ డిఫరెంట్ గా దర్శనమిస్తోంది. రిబ్బన్ కట్టుకున్న రెండు జడలు… ఇవ్వనా వద్దా అనే ఎక్స్ ప్రెషన్… ఒక్క మాటలో చెప్పాలంటే నాటి సావిత్రికి పూర్తి విరుద్ధంగా కీర్తి సురేష్ కనపడుతోందని చెప్పవచ్చు. బహుశా సినిమాల్లోకి రాక ముందు సావిత్రి రూపం ఇలా ఉండేదని చూపించబోతున్నారో ఏమో గానీ, ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.