Keeravaniఒక తెలుగు వాడికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తే ఓర్వలేనితనం ఇండస్ట్రీలోనే కాదు సోషల్ మీడియాలోనూ కనిపిస్తోంది. గోల్డెన్ గ్లోబ్ తో పాటు మొత్తం నాలుగు ఇంటర్నేషనల్ అవార్డులు సాధించిన సందర్భంగా ఎంఎం కీరవాణి ఇవాళ తన జీవితంలోని కొందరు ముఖ్యులకు కృతజ్ఞతలు చెబుతూ ఒక ట్వీట్ వేశారు. అందులో తన కెరీర్ ఈ స్థాయికి చేరడానికి దోహదపడిన వాళ్ళున్నారు. దాని పరమార్థం తెలియని కొందరు అపరమేధావులకు కీరవాణి చెప్పిన పేర్లకు నానార్ధాలు తీసి వాటికి కులం మరక అంటించడానికి కూడా వెనుకాడలేదు. దాని వెనుక అసలు కారణం తెలిస్తే ఈ కామెంట్లు చేసే వాళ్ళు సిగ్గుతో చితికిపోవాల్సిందే

కీరవాణి ప్రస్తావించిన మొదటి పేరు రామోజీరావు. ఫస్ట్ ఆయన గురుంచే ఎందుకు చెప్పారంటే 1990లో డెబ్యూ మూవీగా మనసు మమత రూపంలో అవకాశం ఇచ్చింది ఆయనే కాబట్టి. కమర్షియల్ గా పెద్ద హిట్టు కాకపోయినా మంచి పేరు వచ్చింది. ఆ మరుసటి ఏడాది 1991లో రామోజీ బ్యానర్ లో మూడు సినిమాలు చేశారు. అమ్మ సంగీతానికి మ్యూజిక్ లవర్స్ నుంచి ప్రశంసలు దక్కగా పీపుల్స్ ఎన్ కౌంటర్ ఎలాంటి ఆల్బమ్ అయినా కంపోజ్ చేయగలరనే నమ్మకం కలిగించింది. అశ్విని సైతం విజయం దక్కించుకుంది. ఆపై కీరవాణి స్టార్ లీగ్ కు చేరాక అగ్రిమెంట్ లాంటి చిన్న చిత్రాలు కేవలం రామోజీగారి మీదున్న కృతజ్ఞతతోనే చేశారు

అంతే తప్ప బాహుబలి సెట్లు వేయడానికి ఫిలిం సిటీ ఇచ్చారానో లేక ఆర్థికంగా దానికేమైనా ఆర్థిక వనరులు సమకూర్చడంలో దోహదపడ్డారనే అబద్దపు ప్రచారానికి ఊతం కలిగించడానికో కాదు. తన తొలినాళ్లలో వేసిన అడుగులకు చేయూత నిచ్చిన వాళ్ళను ప్రస్తావించారు తప్పించి వేరే కారణం లేదు. రామోజీకే కాదు తమిళం నుంచి బాలచందర్, మలయాళం నుంచి భరతన్, కన్నడ నుంచి అర్జున్ సర్జలకు థాంక్స్ చెప్పారు. క్రిమినల్ రూపంలో తన బాలీవుడ్ ప్రవేశానికి దారి కల్పించిన మహేష్ భట్ కి చోటిచ్చారు. ఎంఎం క్రీమ్ పేరుతో హిందీ ఆడియన్స్ కి పరిచయం చేసింది భట్టే

ఇలా అన్ని భాషలకు ఒక్కో వ్యక్తిని ఎంచుకుని వాళ్ళ స్థాయికి తన ఎదుగుదలకి గౌరవం ఇచ్చారు తప్ప ఇంకే ఇతర కోణం లేదు. ఒకవేళ కీరవాణి అందరికీ థాంక్స్ చెప్పాలంటే అసిస్టెంట్ గా ఓనమాలు దిద్దించిన చక్రవర్తి గారితో మొదలుపెట్టి తన కమర్షియల్ స్టామినా ప్రపంచానికి చూపించిన కె రాఘవేంద్రరావు దాకా ఎందరికో చెప్పాల్సి ఉంటుంది. ట్వీట్లలో అదంతా సాధ్యం కాదు. ఎక్కడైనా ప్రసంగించే ఛాన్స్ దొరికినప్పుడు ఆ పని చేస్తారు కానీ మరీ ఇలా విషయాన్ని లోతుగా తెలుసుకోకుండా పోస్ట్ మార్టం లు చేయడమే అన్యాయం. గర్వంగా ఫీలవ్వాల్సిన క్షణాలను ఇలా పక్కదారి పట్టించడం హేయం