YS- Jagan-KCRరెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిన్న ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలతో పాటు గోదావరి – కృష్ణాలను అనుసంధానం చేసే ప్రాజెక్టు పై కూడా వారిద్దరూ చర్చించారని సమాచారం.

ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు సహకరించడం లేదని, రాజకీయ కారణాలతో అనేక అంశాల్లో చేయూతనివ్వడం లేదని, రాష్ట్రాల అభ్యున్నతి కోసం తాము తీసుకునే నిర్ణయాలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంపైనా వారు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అవసరమైతే ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి ఈ అంశాలపై చర్చించాలనే ప్రతిపాదన వచ్చినట్లు తెలిసిందని ఈనాడు ఒక బ్యానర్ ఐటెమ్ రాసింది.

పేపర్ మార్కెట్ లోకి వచ్చిన మూడు నాలుగు గంటలలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం దీనిని ఖండించడం గమనార్హం. ఈనాడులో ప్రచురితమైన కథనం కల్పితమని ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలో అలాంటి అంశమేదీ ప్రస్తావనకు రాలేదని తెలిపింది.

ఉహాజనిత అంశాలను ప్రచురించి, ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని ఏపీ సీఎంవో హితవు పలికింది. ఈ విషయమై ఈనాడు దినపత్రిక రాసిన కథనాన్ని ఖండిస్తున్నామని, అది ఉద్దేశపూర్వకంగా రాసిన కథనంగా భావిస్తున్నామని ప్రకటించింది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం దీని మీద స్పందించకపోవడం గమనార్హం.

అదే సమయంలో ఈ మధ్య కాలంలో వార్తాపత్రికలో రాజధాని గురించి అయితే గానీ, గ్రామా సెక్రటేరియట్ పరీక్ష పాత్రల లీక్ గురించి గానీ ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించలేదు. కేంద్రం విషయం అనే సరికి మాత్రం వెంటనే ఖండన ఇవ్వడం గమనార్హం. ముఖ్యమంత్రి జగన్ కేంద్రానికి భయపడుతున్నారా అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.