KCR_YS_Jaganగోదావరి నీటిని మళ్ళించి తెలంగాణకు, శ్రీశైలం ద్వారా రాయలసీమకి నీరందించే ప్రాజెక్టు ఐడియాను తెలంగాణ ప్రభుత్వం ప్రొపోజ్ చెయ్యడమూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూత్రప్రాయంగా ఒప్పుకోవడమూ చకచకా జరిగిపోయాయి. దీనిపై రెండు రాష్ట్రాల నిపుణుల బృందాలు చర్చిస్తున్నాయి. వారు ఇచ్చిన నివేదిక పై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని చర్చించనున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు కనీసం లక్షన్నర కోట్లు ఖర్చు అవుతుందని వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇందులో సగం ఖర్చు ఆంధ్రప్రదేశ్ భరించాల్సి వచ్చినా అది భారమనే చెప్పుకోవాలి. పైగా ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో తెలంగాణ భూభాగంలో ఉంటుంది దానితో కాలువలు కూడా మేజర్ గా అక్కడే ఉంటాయి. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వాలు ఏమీ శాశ్వతం కాదు. రేపు వచ్చే ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోతే ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని ఏమీ లేదు గతంలో చంద్రబాబు ప్రభుత్వం కరెంటు ఇస్తాం శ్రీశైలంలో నీరు వాడొద్దు అని రిక్వెస్ట్ చేసినా తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోని సంగతి తెలిసిందే.

ఇంత ఖర్చు పెట్టి అటువంటి పరిస్థితి ఏర్పడితే అది ఆంధ్రప్రదేశ్ కు శరాఘాతమే అవుతుంది. పైగా ఈ ప్రాజెక్టుకు తెలంగాణ లో గ్రావిటీ ద్వారా ఆంధ్రప్రదేశ్ కు వచ్చే సరికి లిఫ్ట్ పద్దతిలో నీటి తోడి పోస్తారు. అప్పుడు ప్రాజెక్టు నిర్వహణ మరింత భారం అవుతుంది. దీనితో ఈ ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చెయ్యాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీదా ఉంది. త్వరలో జరగబోయే ముఖ్యమంత్రుల సమావేశం తరువాత దీని మీద కొంత క్లారిటీ రావొచ్చని నిపుణులు ఆశిస్తున్నారు.