KCR - YS Jaganకరోనా ని కట్టడి చెయ్యడంలో వాక్సిన్ తప్ప వేరే దారి లేదని అందరికీ తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం కారణంగానే వాక్సిన్ పంపిణీ అనుకున్న స్థాయిలో జరగడం లేదని రాష్ట్రాలు అంటున్నాయి. ఈ విషయంలో తెలంగాణ తరపున మంత్రి కేటీఆర్ కఠినంగానే కేంద్రాన్ని విమర్శిస్తున్నారు.

అయితే ఏపీలో జగన్ మాత్రం అదే విషయాన్ని కొంచెం సుతిమెత్తగా కేంద్రంపై నెడుతున్నారు. అయితే కేంద్రం వాదన ఇంకోలా ఉంది. దేశవ్యాప్తంగా వాక్సిన్ డోసులు తమ వద్ద ఉంచుకుని కూడా ప్రజలకు వెయ్యని టాప్ 10 రాష్ట్రాలలో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి.

గడచిన మూడు నెలల గణాంకాలు పరిశీలిస్తే…. ఆంధ్రప్రదేశ్ వద్ద 6.55 మిలియన్ డోసులు ఉంటే… కేవలం 2.61 మిలియన్ డోసులు మాత్రమే ప్రజలకు ఇచ్చారు. ఇక తెలంగాణ పరిస్థితి అయితే ఇంకా ఘోరం… ఆ రాష్ట్రం వద్ద 4.14 మిలియన్ డోసులు ఉంటే… కేవలం 1.3 మిలియన్ డోసులు మాత్రమే ప్రజలకు ఇచ్చారు.

కేంద్రం డోసులు అందుబాటులోకి తేవడం లేదు సరే అసలు ఉన్న నిలువలను ప్రజలకు ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? ఈ జాబితాలో తెలంగాణ దేశంలోనే నాలుగవ స్థానం, ఆంధ్రప్రదేశ్ ఐదవ స్థానంలో ఉన్నాయి. ఇక 18-44 మధ్య వయసు వారికి వాక్సిన్ ఇవ్వడంలో దేశంలో దాదాపుగా అట్టడుగు స్థానంలోనే రెండు రాష్ట్రాలు ఉన్నాయి.