KCR-YS_Jagan-BJPఏపీలో అధికార వైసీపీ వలన బిజెపి నష్టపోతోందంటూ నిన్న బిజెపి సీనియర్ నేత పీవీఎన్ మాధవ్ చేసిన వ్యాఖ్యలు చాలా ఆలోచింపజేస్తున్నాయి. ఏపీ బిజెపి గురించి చెప్పుకొనే ముందు తెలంగాణ సిఎం కేసీఆర్‌ గురించి నాలుగు ముక్కలు చెప్పుకోవలసి ఉంటుంది. ఆయన కూడా ఇదేవిదంగా ఆ రాష్ట్రంలోని బిజెపి విశ్వసనీయతను దెబ్బ తీశారు. ఆ ఫార్ములానే సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఫాలో అవుతున్నట్లున్నారు.

కేసీఆర్‌ మొదటిసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులతో చాలా సఖ్యతగా ఉండేవారు. పార్లమెంటులో అనేక బిల్లులకు మద్దతు ఇచ్చారు. వివాదాస్పదమైన నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలకు, అలాగే కరోన కట్టడిలో అందరి కంటే ముందుగా కేసీఆర్‌ కేంద్రానికి, ప్రధాని నరేంద్రమోడీకి మద్దతు ప్రకటించిన సంగతి బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది.

అదే సమయంలో తెలంగాణలో బిజెపి కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతోంది. కేసీఆర్‌ ప్రభుత్వ విధానాలను, అవినీతి, అక్రమాలను, నిరంకుశ, అప్రజాస్వామ్య వైఖరిని ఎండగడుతుండేది. కానీ కేసీఆర్‌ వాటిని పట్టించుకొనేవారు కారు. టిఆర్ఎస్‌లో ఎవరూ ఆ విమర్శలను తిప్పి కొట్టేవారు కాదు. కేసీఆర్‌, టిఆర్ఎస్‌ ఎంపీలు మాత్రం ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులతో రాసుకుపూసుకు తిరుగుతుండేవారు. తద్వారా బిజెపి, టిఆర్ఎస్‌ పార్టీల మద్య బలమైన సంబంధాలు ఉన్నాయనే భావన ప్రజలకు కలిగేలా చేశారు. దాంతో రాష్ట్ర బిజెపి నేతలు కేసీఆర్‌ ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలు, ఆరోపణలను ప్రజలు కూడా నమ్మని పరిస్థితి కల్పించారు. తెలంగాణలో బిజెపి విశ్వసనీయతను దారుణంగా దెబ్బతీశారు.

ఆ కారణంగానే నేడు కేసీఆర్‌ నిజంగానే కేంద్రంపై కత్తులు దూస్తున్నప్పటికీ, తెలంగాణ ప్రజలు బిజెపిని ఇంకా నమ్మడం లేదు. కాంగ్రెస్‌ నేతలు కూడా బిజెపి, బిఆర్ఎస్‌ మద్య బలమైన అనుబందం ఉంది…కేంద్రంలో మళ్ళీ మోడీ, రాష్ట్రంలో తాను అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్‌, రాష్ట్ర బిజెపి నేతలు ఉత్తుత్తి పోరాటాలు చేస్తున్నారంటూ వాదిస్తున్నారు.

అంటే కేసీఆర్‌ ఓసారి స్నేహంతో బిజెపిని దెబ్బతీస్తే ఈసారి యుద్ధం చేస్తూ దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్దమవుతోంది. ఈ నేపద్యంలో చూస్తే, సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఏపీ బిజెపిని సరిగ్గా ఇదేవిదంగా ‘హ్యాండిల్’ చేస్తున్నట్లు అర్దమవుతోంది. దీంతో ఏపీ బిజెపి విశ్వసనీయత దెబ్బతిందని ఎమ్మెల్సీ ఎన్నికలలో రుజువు అయ్యింది కూడా. ఇదే విషయం బిజెపి నేత మాధవ్ బయటపెట్టారు. కనుక బిజెపి ఇకనైనా మేల్కోంటుందో లేదో చూద్దాం.