KCR_YS-Jagan_Amith-Shahబిజెపి-వైసీపీలది ఓ విచిత్ర బందం. వైసీపీ ఎంపీల మద్దతు కోసం బిజెపి వైసీపీ ప్రభుత్వ తీరును చూసిచూడనట్లు వదిలేస్తుంటే, నిధుల కోసం కేంద్రం ముందు చేయి చాచక తప్పదు కనుక బిజెపికి అవసరమైనప్పుడు వైసీపీ మద్దతు ఇస్తుంటుంది.

ఒకవేళ వైసీపీ వద్ద 23 మంది ఎంపీలే లేకుంటే జగన్ అడగ్గానే ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ లభించేదా? నెలనెలా టంచనుగా అప్పులు పుట్టేవా?అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏమై ఉండేది?కానీ అదృష్టవశాత్తు ఏపీ ప్రజలు వైసీపీకి ఏకంగా 23 మంది ఎంపీలను ఇచ్చేశారు.

రాష్ట్రపతి ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవడంతో ఎన్డీయే అభ్యర్ధికి మద్దతు కూడగట్టడానికి బిజెపి ప్రయత్నాలు మొదలుపెట్టింది. మొదట వైసీపీతోనే ప్రారంభిస్తుందని వేరే చెప్పక్కర లేదు. ఇప్పటికే కేంద్రహోంమంత్రి అమిత్ కేంద్రహోంమంత్రి అమిత్ షా ఇదే విషయంపై సిఎం జగన్మోహన్ రెడ్డితో చర్చించారు. కనుక వైసీపీ మద్దతు ఇవ్వడం తధ్యం.

ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు (ఎలక్టోరల్ కాలేజి) అందరివి కలిపి ఓట్ల విలువ 10.86 లక్షలున్నాయి. అదే.. శాతంలో చెప్పుకొంటే 48.9 శాతం. కనుక ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిని గెలిపించుకోవడానికి మరో 11,990 ఓట్లు లేదా 1.1 శాతం మద్దతు అవసరం ఉంది.

వైసీపీ వద్ద సుమారు 45,000 పైనే విలువైన ఓట్లున్నాయి. కనుక వైసీపీ మద్దతు ఇస్తే బిజెపి అవలీలగా తన రాష్ట్రపతి అభ్యర్ధిని గెలిపించుకోగలదు. అయినప్పటికీ బిజెపి ఒడిశాలో 13,000 ఓట్లు కలిగిన బిజెడి, బిహార్‌లో నితీశ్ కుమార్‌ పార్టీ జేడీయుల మద్దతు కూడా పొందేందుకు ప్రయత్నిస్తోంది.

నిన్న కడపలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంపీ విజయసాయి రెడ్డి వచ్చినప్పుడు అక్కడ మీడియా ప్రతినిధులు ఇదే విషయంపై ఆయనను ప్రశ్నించారు. “బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీకి వచ్చి మీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు కదా?మరి రాష్ట్రపతి ఎన్నికలలో మీ పార్టీ బిజెపికి మద్దతు ఇస్తుందా లేదా?” అని ప్రశ్నించగా, “రాష్ట్రానికి న్యాయంగా ఈయవలసినవి కూడా ఈయకుండా ఇబ్బంది పెడుతున్నది కేంద్రప్రభుత్వమే. ఇంతవరకు విభజన హామీలు కూడా అమలుచేయలేదు. రాష్ట్రానికి అదనంగా ఏమిచ్చారని మా ప్రభుత్వంపై విమర్శిస్తున్నారో తెలీదు. రాష్ట్రపతి ఎన్నికపై సిఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా నిర్ణయం తీసుకొంటారు,” అని చెప్పారు.

“కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తోంది కనుక రాష్ట్రపతి ఎన్నికలో కేంద్రానికి మద్దతు ఇవ్వదలచుకోలేదు,” అని విజయసాయి రెడ్డి చెప్పలేకపోయారు. అదే… తెలంగాణ సిఎం కేసీఆర్‌, టిఆర్ఎస్‌ పార్టీ నేతలు నిత్యం కేంద్రప్రభుత్వం తమ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం అన్యాయం చేస్తోందని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అంతేకాదు… రాష్ట్రపతి ఎన్నికలలో బిజెపికి పోటీగా బిజెపియేతర అభ్యర్ధిని బరిలో దించేందుకు తెలంగాణ సిఎం కేసీఆర్‌ సిద్దం అవుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడేందుకు సిఎం కేసీఆర్‌ ఏమాత్రం వెనకడటం లేదు. కానీ ఏపీ ప్రయోజనాల కోసం సిఎం జగన్మోహన్ రెడ్డి గట్టిగా నోరు విప్పి మాట్లాడలేకపోతున్నారు. పైగా ఏపీకి అన్యాయం జరుగుతున్నా కేంద్రానికి మద్దతు ఇచ్చేందుకు సిద్దపడుతున్నారు. ఎందుకు?